శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 25, 2020 , 23:07:25

కందుల కొనుగోళ్లు షురూ

కందుల కొనుగోళ్లు షురూ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జిల్లాలో ఈ యేడు కంది సాగు బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది జిల్లాలో సుమారు 45 వేల 693 ఎకరాల్లో సాగు చేయగా దాదాపు 2 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాగా ఈ యేడు జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగుచేశారు. దీంతో పాటు వర్షాలు సరిగా లేక దిగుబడి కూడా చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది 11 వేల నుంచి 15 వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సుమారు 11 వేల 500 మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 


గతేడాది కంటే రూ. 125 పెరిగిన ధర..

గతేడాది మార్కెట్‌ యార్డుల్లో మార్కెట్‌ ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం క్వింటాలు కందులను రూ. 5675 చెల్లించి కొనుగోలు చేసింది. ఈ యేడ ధరను ప్రభుత్వం మరో రూ. 125 పెంచి రూ. 5800 క్వింటాలు చొప్పున కొనుగోలు చేపట్టనుంది. బయటి ప్రైవేట్‌ వ్యాపారులు రూ. 4500 నుంచి 4800 వరకు చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులందరూ మార్కెట్‌ యార్డుల్లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కందులను విక్రయించారు. అయితే గతేడాది సంచులకొరత, ఇతర కారణాల వలన అధికారులు సకాలంలో కందులను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌ యార్డుల్లోనే కందులను ఆరబెట్టుకునేందుకు విశాలమైన స్థలంతో పాటు, మౌలిక అవసరాలను కల్పించాలమని ఇక్కడే విక్రయించాలని కోరుతున్నారు. 


మూడు కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలో ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, జైనూర్‌ మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తేమ శాతం 14 ఉంటే గిట్టుబాటు ధర వర్తిస్తుంది. కందులు విక్రయించే రైతులు తేమ శాతాన్ని తగ్గించి తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో 2401 హెక్టార్లు, తిర్యాణిలో 1434.8 హెక్టార్లు, రెబ్బెనలో 719.6 హెక్టార్లు, వాంకిడిలో 2150 హెక్టార్లు, కాగజ్‌నగర్‌లో 545.6 హెక్టార్లు, సిర్పూర్‌-టిలో 190.8 హెక్టార్లు, కౌటాలలో 48.4 హెక్టార్లు, పెంచికల్‌పేట్‌లో 6.4 హెక్టార్లు, దహెగాంలో 40.4 హెక్టార్లు, బెజ్జూర్‌లో 170 హెక్టార్లు, చింతలమానేపల్లిలో 42.8 హెకార్టు, సిర్పూర్‌-యులో 895.6 హెక్టార్లు, లింగాపూర్‌లో 592.8 హెక్టార్లు, కెరమెరిలో 1857.2 హెక్టార్లు, జైనూర్‌లో 1039.2 హెక్టార్లలో కందులు సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.కందులను విక్రయించే రైతులు ఆధార్‌, పట్టా, బ్యాంకు పాస్‌పుస్తకాల జిరాక్సులు తమ వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు.


వాటర్‌ ట్యాంకర్‌ అందజేత 

చింతలమానేపల్లి : మండలంలోని బాలాజీఅన్‌కోడ గ్రామ పంచాయతీకి మంగళవారం ఎంపీపీ డుబ్బుల నానయ్య వాటర్‌ ట్యాంకర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, కోఆప్షన్‌ సభ్యుడు నాజీం హుస్సేన్‌, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకన్న, బాలాజీ అన్‌కోడ సర్పంచ్‌ సుజాత, కార్యదర్శి సుజాత, ఉప సర్పంచ్‌ నందు, శేఖర్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీ

దహెగాం: మండలంలోని పలు గ్రామాల్లోని దుకాణాల్లో తూనికలు, కొలతల  తనిఖీల అధికారులు తనిఖీలు చేశారు. తూకాలను పరిశీలించి ముద్రలు వేశారు. తూకాలను సవరించుకొని వారు త్వరగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ఎంఏ జలీల్‌, అసిస్టెంట్‌ అధికారి సుందర్‌రా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo