సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 25, 2020 , 00:04:31

కాజాలనగర్ కళకళలాడాలి

కాజాలనగర్ కళకళలాడాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టాటీయ గార్డెన్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధ్యక్షతన సోమవారం పంచాయతీరాజ్‌ సమ్మేళనం, పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామాల అభివృద్ధిని నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పల్లెల అభివృద్ధిని తెలుసుకోవడానికి కలెక్టర్‌ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరూ పల్లె నిద్ర చేయాలని సూచించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులను చేసుకోవాలని సర్పంచులు,అధికారులకు సూచించారు. గ్రామాల్లో రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతిని ఇక నిరంతరం కొనసాగించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.15 రోజుల్లో మిగితా వాటికి అందజేస్తామని చెప్పారు. 


రానున్న రోజుల్లో రెవెన్యూ చట్టం పటిష్టం కాబోతున్నదనీ, రాష్ట్రంలో భూ వివాదాలే లేకుండా చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న వారికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడం, 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ మంజూరుపై బడ్జెట్‌ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచడానికి సర్పంచులు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లను ఉపయోగించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ జిల్లాలో అధికారులు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్మశాన వాటిక, డంప్‌యార్డుల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినప్పటికీ, అటవీ అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ మాట్లాడుతూ పరిసరాలపై స్వీయ నియంత్రణ ఉండాలని సర్పంచులకు సూచించారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి, పెంచాలన్నారు. 


జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి మాట్లాడుతూ  గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సర్పంచులకు, ఉప సర్పంచులకు పూర్తి అధికారాలు ఉన్నాయనీ, ఎవరికీ తలొగ్గకుండా తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజురు చేస్తోందన్నారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ ఇబ్బందులను అధిగమించి గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలో 15 వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. జిల్లాలో 15 చోట్ల శ్మశానవాటిక నిర్మాణాలకు అడ్డంకులు ఉన్నాయనీ, వీటిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. జిల్లాలో 1290 కిలోమీటర్ల రహదారులకు అనుమతులు సాధించినట్లు వివరించారు. కార్యక్రంమలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, జడ్పీ సీఈవో దాసరి వేణు, డీఆర్‌డీవో వెంకటశైలేష్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కనక యాదవరావు, ఎంపీడీవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo