బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 25, 2020 , 00:02:08

ఎన్నిక ఏకపక్షమే!

ఎన్నిక ఏకపక్షమే!

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా.. వీటిలో 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. వీరి నుంచి డీసీసీబీకి 16మంది డైరెక్టర్లు, మరో నలుగురు బీ గ్రూపు సంఘాల నుంచి డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. డీసీఎంఎస్‌లో పది మంది డైరెక్టర్లు ఎన్నికవుతుండగా.. ఇందులో ఆరుగురు పీఏసీఎస్‌ల నుంచి, బీ గ్రూపు నుంచి నలుగురు డీసీఎంఎస్‌కు పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లాలో 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోవడంతో పూర్తి మెజార్టీ ఉంది. దీంతో ఈనెల 28న నిర్వహించే డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఈనెల 28న నిర్వహించే డైరెక్టర్ల ఎన్నిక కోసం నేడు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ఒకేరోజు చేస్తున్నారు. డీసీసీబీకి 20మందికి, డీసీఎంఎస్‌కు 10 మంది డైరెక్టర్లను ఈనెల 28న ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగే అవకాశాలుండగా, అన్ని డైరెక్టరు పోస్టులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీకి మద్దతుదారులు పెద్దగా లేకపోవడంతో ఎన్నికల్లో నామినేషన్లు వేసే పరిస్థితి కన్పించడం లేదు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల మెజార్టీ పూర్తిగా ఉండడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోస్టులు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 


సమన్వయంతో ముందుకు..

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు సంబంధించి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలంతా సమన్వ యంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి అభ్యర్థులు ఎవరనేది జిల్లా ఎమ్మెల్యేలంతా చర్చించుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి పేర్లను ఏకాభిప్రాయంతో పంపాలని జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ పేర్లలో అధిష్టానం ఎవరిని ఖరారు చేసినా.. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని భావిస్తు న్నారు. ఇప్పటికే జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు పలువురు ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలంతా ఇప్పటికే ఈ పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తోంఇ. అధిష్టానానికి కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక తుది ప్రకటన అధిష్టానం నుంచే రానుంది. ఇదిలాఉండగా.. బెల్లంపల్లిలో దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో విప్‌ సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య భేటీ అయ్యారు. 


ఉమ్మడి జిల్లా ప్రామాణికంగానే..

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ప్రామాణికంగా తీసుకుని డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన జరిగినప్పటికీ డీసీసీబీ, డీసీఎంఎస్‌ మాత్రం ఉమ్మడిగానే ఉంది. ఉమ్మడి జిల్లాలో 77 పీఏసీఎస్‌లుండగా.. నిర్మల్‌ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 20, ఆసిఫాబాద్‌ జిల్లాలో 12, ఆదిలాబాద్‌ జిల్లాలో 28 చొప్పున పీఏసీఎస్‌లు ఉన్నాయి. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను సమానంగా ఇవ్వాలని జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు వచ్చేలా పంపకాలు చేయాలని ఎమ్మెల్యేలంతా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల్లో ఒక జిల్లాకు ఛైర్మన్‌, మరో జిల్లాకు వైస్‌ చైర్మన్‌ వచ్చేలా నాలుగు జిల్లాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పశ్చిమ జిల్లాకు సంబంధించి ఒక చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌, తూర్పు జిల్లాకు సంబంధించి ఒక చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌ ఇచ్చేలా దృష్టి పెట్టారు. ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికలుండగా, నేడు నామినేషన్లు వేస్తున్నారు. ఈనెల 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.


logo
>>>>>>