గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 24, 2020 , 00:38:22

నేడు పంచాయతీరాజ్‌ సమ్మేళనం

నేడు పంచాయతీరాజ్‌ సమ్మేళనం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగించడంతో పాటు పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్‌ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమించింది. నేడు జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్‌లో  పంచాయతీ రాజ్‌ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు పంచాయతీ రాజ్‌ చట్టం, విధులు, బాధ్యతలపై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. 


ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. జిల్లాలో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సోమవారం గ్రామల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను వివరిస్తారు. దీంతో పాటు నూతన పంచాయతీరాజ్‌ చట్టం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మొదలుకొని పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో పాల్గొననున్నారు.జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. మొదటి దశలో 30 రోజుల పాటు, రెండో విడతలో 10 రోజుల పాటు జిల్లాలో కార్యక్రమం సాగింది. ఊరూరా ఉద్యమంలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కొనసాగించారు. దీంతో జిల్లాలోని గ్రామాలు కొత్త ఒరవడిని సంతరించుకొని ఆదర్శంగా మారాయి. ఇదే స్ఫూర్తితో పల్లెప్రగతి కార్యక్రమాలను శాశ్వతంగా నిర్వహించాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి పల్లెలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతోంది. 


పల్లెప్రగతి కార్యక్రమాలను శాశ్వతంగా నిర్వహించడం ద్వారా పల్లెలు ఆదర్శవంతమైన పురోగతిని సాధించనున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, మురుగు కాలువలు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలు తొలగించడం, రోడ్లును బాగు చేయడం, విద్యుత్‌ లైన్లను బాగుచేయడం, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ ఎరువుల తయారీ కేంద్రాల నిర్మాణం, ప్రతి గ్రామంలో హరితహారం మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు నిరంతరం చేపట్టనున్నారు. కార్యక్రమాలను అమలు చేయడం గురించి రెవెన్యూ సదస్సులో అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నారు. సమ్మేళనంలో చర్చించిన విషయాల ఆధారంగా గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనేలా, పచ్చదనం కలిగేలా చర్యలు తీసుకుంటారు. పల్లె ప్రగతిపనులను ప్రత్యేక ఫ్లయింగ్‌ స్వాడ్‌లు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిశీలిస్తారు. నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. పల్లె ప్రగతి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు.


logo
>>>>>>