గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 21, 2020 , 04:22:31

సమష్టిగా పనిచేస్తేనే పట్టణ ప్రగతి

సమష్టిగా పనిచేస్తేనే పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతి మన చేతుల్లోనే ఉందనీ, కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఆశించినట్లుగా లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు.

  • ఈ నెల 24వ తేదీ నుంచి 10 రోజుల పాటు కార్యక్రమాలు
  • మున్సిపల్‌ చట్టంపై అవగాహన అవసరం
  • పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి పెట్టాలి
  • విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి
  • పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి
  • నిర్దిష్టమైన పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలి
  • ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవు
  • కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా
  • కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ‘పట్టణ ప్రగతి’ సమ్మేళనం
  • పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అదనపు కలెక్టర్‌ రాంబాబు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణారావు, చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ తిరుపతి

కాగజ్‌నగర్‌ టౌన్‌ :  పట్టణ ప్రగతి మన చేతుల్లోనే ఉందనీ, కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఆశించినట్లుగా లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అదనపు కలెక్టర్‌ రాంబాబు, జడ్పీవైస్‌ చైర్మన్‌ కృష్ణారావుతో కలిసి ‘పట్టణ ప్రగతి సమ్మేళనము’ నిర్వహించగా, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌కుమార్‌, కమిషనర్‌ తిరుపతి కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు ఒక్కో దానికి ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు చెత్తాచెదారం, డ్రైనేజీల క్లీనింగ్‌, వేలాడే విద్యుత్‌ తీగలు సరిచేయడంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పార్కులు, మైదానాల విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలని, నిర్లక్ష్యంగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పచ్చదనం ఉట్టి పడేలా పట్టణాన్ని తీర్చిదిద్దాలని, మున్సిపల్‌ చట్టంపై అందరికి అవగాహన ఉండాలన్నారు.  ఇనుప స్తంభాలు లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖ ఏఈ, డీఈలను ఆదేశించారు. అదేవిధంగా బిల్డింగ్‌లు అన్నింటికి అనుమతులు ఉన్నాయా..? అని డీఈ గోపాల్‌, టీపీబీవో సాయి, ఏఈ సతీశ్‌ను అడిగారు. ప్రజలకు అవసరమైన పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌లను ఏర్పాటు చేయాలని, దీని కోసం స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. 


వాహనాలు నిర్ధిష్ఠ ప్రదేశాల్లో పార్కింగ్‌ చేసేలా ప్రదేశాలను ఎంపిక చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. బస్టాండ్‌ సమీపంలోని ఆటో స్టాండ్‌ వద్ద షెడ్డు, డ్రైనేజీ నిర్మాణంతోపాటు రోడ్డుకు ఇరువైపులా భూమి చదును చేయాలని సూచించారు. అక్కడి నుంచి సర్‌సిల్క్‌లోని లక్ష్మీ నారాయణ ఆలయ సమీపంలోని మైదానాన్ని పరిశీలించి, యువజన శాఖ నుంచి అవసరమైన నిధులను సమకూర్చి పనులు పూర్తయ్యేలా నివేదికలను తయారు చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబుకు సూచించారు. అనంతరం వార్డు నెం 7 కౌన్సిలర్‌ ఎల్లేశ్‌  తన వార్డులో డ్రైనేజీ సరిగా లేక వానకాలంలో కాలనీ చెరువును తలపిస్తున్నదనీ, ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే సంజీవయ్య కాలనీలోని డ్రైనేజీని పరిశీలించి కాలువలో ఇనుప జాలిని ఏర్పాటు చేయడంతో వ్యర్థాలు నిలిచి నీరు వెళ్తుందని, అదే విధంగా బాక్స్‌టైప్‌ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కాలువకు ఇరువైపులా అక్రమణలు ఉంటే తొలగించాలని సూచించారు. అనంతరం పట్టణంలో సులబ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ పల్లె ప్రగతి విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి కట్టుగా పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. 


గజ్వేల్‌లో ఇంటిగ్రిటివ్‌ మార్కెట్‌ను ఆదర్శంగా తీసుకోని ఈ నమూనాలో కాగజ్‌నగర్‌లో రూపొందించాలని సూచించారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు పెద్దవాగులో ఇన్‌టెక్‌వెల్‌ పనులు చేపడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు, మున్సిపల్‌ సిబ్బంది కలిసి కట్టుగా 10 రోజులు పని చేస్తే పట్టణం రూపురేఖలు మారుతాయన్నారు. సంజీవయ్య కాలనీ నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు పట్టణ ప్రగతి విధి విధానాలు, లక్ష్యాలను వివరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ మాట్లాడుతూ ప్రణాళికలో నిర్ధేశించిన లక్ష్యాలను చేరేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్లు పట్టణంలోని సంజీవయ్య కాలనీలో చేపట్టాల్సిన కార్యచరణపై పరిశీలించారు. వీరితో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ గిరీష్‌ కుమార్‌, కమిషనర్‌ తిరుపతి, డీఈ గోపాల్‌, ఏఈ సతీశ్‌, వార్డు కౌన్సిలర్లు ఆయావార్డుల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. 


logo