మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 21, 2020 , 04:20:20

‘డీసీసీబీ’ ఎన్నికలకు నోటిఫికేషన్‌

‘డీసీసీబీ’ ఎన్నికలకు నోటిఫికేషన్‌

సహకార శాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల(పీఏసీఎస్‌) ఎన్నికలు ముగియగా.. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది.

  • విడుదల చేసిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ
  • ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నిక
  • 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహణ

సహకార శాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల(పీఏసీఎస్‌) ఎన్నికలు ముగియగా.. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.                                 - నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ


నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికపై రాష్ట్ర సహకార శాఖ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సహకార శాఖ అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక నిర్వహణ కోసం సహకార శాఖ అధికారులు ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు, డీసీఎంఎస్‌లో 10 మంది డైరెక్టర్లు ఉంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను జిల్లాలోని 77 మంది పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లో ఆరుగురు డైరెక్టర్లను కూడా వీరే ఎన్నుకుంటారు. డీసీసీబీలో నలుగురిని డీసీఎంఎస్‌లో నలుగురిని, బీ గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కంటే ముందుగా 77 మంది ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్‌లు 16 మంది తమలో నుంచి ఏ గ్రూపు నుంచి 16 మంది డైరెక్టర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఎస్సీ కేటగిరీ నుంచి 3, ఎస్టీ కేటగిరీ నుంచి 1, బీసీ కేటగిరీ నుంచి 2, ఓపెన్‌ కేటగిరీ నుంచి 10 మంది డైరెక్టర్‌లుగా ఉంటారు. దీంతోపాటు మరో నలుగురు బీ గ్రూపునకు సంబంధించిన వ్యవసాయేతర సహకా రం సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్‌లను ఎన్నిక జరుగుతుంది. ఎస్సీ నుంచి ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, జనరల్‌ ఒకరు చొప్పున నలుగురు బి గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. మొత్తం 20 మంది డైరెక్టర్‌లను ఎన్నుకున్న తర్వాత డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. డీసీఎంఎస్‌లో 10 మంది డైరెక్టర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రూపునకు సంబంధించి ఆరుగురు.. ఇందులో ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒక రు, బీసీ ఒకరు, జనరల్‌ నుంచి ముగ్గురు డైరెక్టర్లను ఏ గ్రూప్‌ సభ్యులు ఎన్నుకుంటారు. నలుగురు డైరెక్టర్లను బి గ్రూప్‌ సభ్యులు ఎన్నుకోగా.. ఇందులో ఒ కరు ఎస్సీ, ఒకరు బీసీ, ఇద్దరు జనరల్‌ నుంచి ఎన్నుకుంటారు. ఈ లెక్కన డీసీసీబీకి 20 మంది ఎన్నికవుతుండగా.. ఇందులో 16 మంది ఏ గ్రేపు నుంచి నలుగురు బీ గ్రూపు నుంచి ఎన్నికవుతారు. డీసీఎంఎస్‌కు పది మంది ఎన్నికవుతుండగా.. ఏ గ్రూపు నుంచి ఆరుగురు, బి గ్రూపు నుంచి నలుగురు ఎన్నికవుతారు. ఎన్నికల్లో నిలబడే వారికి ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. 


రిజర్వేషన్లవారీగా రంగుల బ్యాలెట్‌లు..

రిజర్వేషన్లవారీగా రంగుల బ్యాలెట్‌ పత్రాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరీ నుంచి పోటీ చేసే వా రికి పింక్‌, ఎస్టీ నుంచి పోటీ చేసే వారికి లైట్‌ బ్లూ, బీసీ వారికి లైట్‌ గ్రీన్‌, జనరల్‌ వారికి వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ ఉంటుంది. డైరెక్టర్‌ పోస్టులకు ఒకరికంటే ఎక్కువ మంది వివిధ కేటగిరీల్లో నామినేషన్లు వేస్తే ఎన్నిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం.. ఉన్న డైరెక్టర్‌ స్థానాలకు అంతే సంఖ్యలో నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తారు. ఆయా కేటగిరీలో డైరెక్టర్ల కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర స హకార ఎన్నికల అథారిటి అధికారి, సహాయ ఎన్నికల అధికారిని నియమించింది. ఈనెల 28న డైరెక్టర్ల ఎన్నిక ఉండగా.. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ వి ధానం ఉంటుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు కూడా రహస్య బ్యాలెట్‌ విధానంలోనే ఉంటుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు కూడా ఒకరు ప్రతిపాదన, మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. జిల్లాలో 77 పీఏసీఎస్‌లుండగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 71మంది సభ్యులు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీ జేపీ నుంచి ముగ్గురు ఏ గ్రూపు సభ్యులు ఉన్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ పాలకవర్గాల ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అభిష్టం మేరకే టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.


డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికల షెడ్యూల్‌

ఫిబ్రవరి 20 : డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ 

ఫిబ్రవరి 22 : ఫాం-ఎ నోటీసు జారీ

ఫిబ్రవరి 25 : ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల స్వీకరణ.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన.. 3.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.

ఫిబ్రవరి 28 : ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌.. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

ఫిబ్రవరి 29 : డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక


logo
>>>>>>