గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 18, 2020 , 23:33:26

పల్లెలకు ప్రగతి ట్రాక్టర్‌

పల్లెలకు ప్రగతి ట్రాక్టర్‌

ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా ఊరికో ట్రాక్టర్‌ అందిస్తున్నచి.. జిల్లావ్యాప్తంగా 334 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే రూ.11.11 కోట్లతో 247 జీపీలకు సమకూర్చింది.

  • 30 రోజుల ప్రణాళికలో భాగంగా ట్రాక్టర్ల పంపిణీకి శ్రీకారం
  • పల్లెలను ప్రగతి బాట పట్టించి.. ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో
  • ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 247 జీపీలకు అందజేత
  • రూ.11.11 కోట్లతో వాహనాల కొనుగోలు
  • మిగతా 87 పంచాయతీలకు త్వరలో ఇచ్చేందుకు కసరత్తు
  • అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు వినియోగం
  • హర్షం వ్యక్తం చేస్తున్న పాలకవర్గాలు, ప్రజలు

ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా ఊరికో ట్రాక్టర్‌ అందిస్తున్నచి.. జిల్లావ్యాప్తంగా 334 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే రూ.11.11 కోట్లతో 247 జీపీలకు సమకూర్చింది. మిగతా 87 గ్రామాలకు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇక వాహనాలు అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు అనేక మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తుండగా, పాలకవర్గాలతో పాటు ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతున్నది.     


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో  మారుమూల ప్రాంతాలే అధికం. పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దడం లో భాగంగా పంచాయతీకో ట్రాక్టర్‌ను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా పంచాయతీల నిధుల నుంచే కాకుండా బ్యాంకుల సహకారంతో ఇప్పటికే 247 గ్రామాలకు అందజేయగా, మిగితా 87 జీపీలకు త్వరలోనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం ట్రాక్టర్‌ అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కలకు నీరు పోయడం, తదితర కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు.


పల్లె ప్రగతిలో భాగంగా..

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుతలో 30 రోజుల పాటు, రెండో విడుతలో 10 రోజుల  పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పలు సమస్యలకు పరిష్కారం లభించింది. కొత్త పంచాయతీలు ఏర్పడినప్పుటి నుంచి జిల్లాలో 334 జీపీలకు ప్రభుత్వం సుమారు రూ. 40 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో అవసరమైన పనులను చేపట్టడంతో పాటు అభివృద్ధికి అవసరమైన పనులు నిర్వహించారు. కావాల్సిన వసతులు, ట్రాక్టర్‌   సమకూర్చుకున్నారు. ఇప్పటికే ట్రాక్టర్ల కొనుగోలుకు రూ. 11.11 కోట్లు వినియోగించారు. జిల్లాలో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య లోపం లేకుండా చూసుకోవడం ఇందులో ప్రధానమైనది. చెత్తా చెదారాన్ని డంపింగ్‌ యార్డులకు నిత్యం తరలించే వీలు కల్పించింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని అందించేందుకు వీలుగా ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయడంతో ప్రతి పల్లెనూ పచ్చదనం వైపు నడిపించే అవకాశం కలిగింది. అలాగే ప్రస్తుతం సాగుతున్న వైకుంఠధామాల పనులు, నర్సరీల పనులకు వీటిని వినియోగించనున్నారు. దీని ద్వారా పంచాయతీలకు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఏర్పడింది. ఇంతే కాకుండా పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల అభివృద్ధి పనులకు కావాల్సిన సామగ్రిని తరలించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. మొత్తానికి పల్లెలను ఆదర్శనీయంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారు తెలంగాణను తయారు చేసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేయడం ప్రజలందరికీ మేలు చేయనుందని సర్పంచులు స్పష్టం చేస్తున్నారు.


ఊర్లు బాగుపడుతయ్‌.. 

పెంచికల్‌పేట్‌ : ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది గ్రామాల అభివృద్ధికి దోహదపడతుంది. ఈ ట్రాక్టర్ల ద్వారా జీపీలల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం డంపింగ్‌యార్డుకు తరలించడమే కాకుండా ఎక్కడైనా రోడ్లు బురదమయమైతే అక్కడ మట్టి పోయించడం లాంటి పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దార్లను నిర్మించి రైతులు నడిచేందుకు బాటలు నిర్మించడం, ఇతర పనులకు ఉపయోగపడుతుంది. ఇకపై గ్రామంలో వివిధ పనులను చేపడుతాం. ప్రజల అవసరాల మేరకు ఈ ట్రాక్టర్‌ ను వినియోగించుకుంటాం. - జాజిమొగ్గ శ్రీనివాస్‌, లోడ్‌పెల్లి సర్పంచ్‌ 


చాలా సంతోషంగా ఉంది..

పెంచికల్‌పేట్‌ : గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. పల్లెలు పారిశుధ్యం పచ్చదనంతో నిండుగా కనిపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా చెత్తను తరలించేందుకు వాహనాలు లేక ఇదివరకు సర్పంచ్‌లు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ కొనుగోలు చేసి గ్రామాల్లోని చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వార్డు సభ్యుల సహకారంతో ముందకెళ్తా. -దుర్గం రాజన్న, ఎల్లూర్‌ సర్పంచ్‌ 


ఆదర్శంగా మారుస్తాం..

బెజ్జూర్‌ : ముంజంపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. ప్రభుత్వం పంచాయతీకో ట్రాక్టర్‌ అందజేసేందుకు మాకు ఎంతో సహకరిస్తున్నది. పల్లెల్లో చేపట్టే వివిధ పనులకు, పారిశుధ్య చర్యలకు ఈ ట్రాక్టర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలించేందుకు, మొక్కలకు నీరు పోసేందుకు, రోడ్ల మరమ్మతులు, తదితర పనులకు పంచాయతీ ట్రాక్టర్‌ ఉండడం ఎంతో మేలు చేస్తుంది. దీంతో పంచాయతీ ఖర్చును ఆదా చేయవచ్చు. ట్యాంకర్‌ను అందించడం అభినందనీయం. పల్లెల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో నేనూ భాగస్వామినవడం అదృష్టంగా భావిస్తున్నా. -చాపిలే కళావతి, ముంజంపల్లి సర్పంచ్‌ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 


రెబ్బెన : పంచాయతీకి ట్రాక్టర్‌ రావడంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దక్కింది. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, నిత్యం తరలించడంతో పారిశుధ్యలోపం కనిపించకుండా పోయింది. ఇన్నాళ్లు పంచాయతీలో ఏ అవసరమున్నా ప్రైవేట్‌ వ్యక్తుల ట్రాక్టర్లపై ఆధార పడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడూ గ్రామంలో పనులు చేసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే పనులనే ఈ ట్రాక్టర్‌ ద్వారా చేపడుతాం. రానున్న రోజుల్లో గంగాపూర్‌ పంచాయతీని ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా స్థానిక ప్రజలు, వార్డుసభ్యులతో కలిసి కృషి చేస్తా.  - పందిర్ల వినోద, గంగాపూర్‌ సర్పంచ్‌


మార్పే లక్ష్యంగా..

కౌటాల రూరల్‌: గ్రామాల రూపురేఖల మార్పే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. పల్లెప్రగతి, 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో దాదాపుగా సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. మా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ మంజూరు చేయడంతో గ్రామంలోని చెత్తాచెదారాన్ని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పచ్చదనం కాపాడుకునేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పంచాయతీ అవసరాలకే ఈ ట్రాక్టర్‌ను వినియోగిస్తాం.                        -ఎడ్ల శారద, కనికి సర్పంచ్‌ 


మెరుగుపడింది..

కౌటాల రూరల్‌: ముత్తంపేట గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ మంజూరు చేయడంతో గ్రామంలో పారిశుధ్య సమస్య తీరింది. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ట్రాక్టర్‌ సహాయంతో ప్రతీరోజు వీధుల్లో తిరిగి చెత్తను పోగు చేసి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. అలాగే హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని ట్యాంకర్‌ సహాయంతో అందిస్తున్నాం. దీంతో మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి. ముత్తంపేటను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నా. గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ఇలా ట్రాక్టర్‌ అందజేయడం అభినందనీయం. 

- ఆదె శ్రీనివాస్‌, ముత్తంపేట సర్పంచ్‌


ఆలోచన భేష్‌..

చింతలమానేపల్లి : పంచాయతీలకు ట్రాక్టర్‌ ఇవ్వడమనేది చాలా మంచి ఆలోచన. గతంలో ఏ ముఖ్యమంత్రీ పల్లెలను సరిగా పట్టించుకోలేదు. సీఎం కేసీఆరే ప్రతి పల్లె అభివృద్ధిపై దృష్టి పెట్టిన్రు. ప్రగతి ప్రణాళిక లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిండు. పల్లెల్లో పారిశుధ్యలోపం నివారించేందుకు ఇప్పుడు ట్రాక్టర్‌ను అందజేసిన్రు. దీనిని గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు వినియోగిస్తున్నాం. ప్రతి పల్లె పచ్చగా ఉండాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా గ్రామంలో పారిశుధ్యలోపం లేకుండా చూసుకుంటున్నాం.                      -మేకల ప్రసాద్‌, చింతలమానేపల్లి సర్పంచ్‌


అదృష్టంగా భావిస్తున్నా..

తిర్యాణి : పల్లెలను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలో నేనూ భాగస్వామినవడం అదృష్టంగా భావిస్తున్నా. పల్లెల్లో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని, పచ్చదనం వైపు నడిపించాలనే ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించింది. గ్రామాల్లో తడి, పొడి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు,హరితహారం మొక్కలకు నీటిని పట్టించడానికి, శ్మశానవాటిక, నర్సరీ పనులకు వినియోగించడానికి ఈ ట్రాక్టర్‌ ఎంతో ఉపయోగపడుతున్నది. గ్రామాల్లో వివిధ కార్యక్రమాలకు నీటిని సరఫరా చేయడం ద్వారా ఆదాయం సమకూరడంతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది.                                                                                 - కొర్వెత సింధూజ, తిర్యాణి సర్పంచ్‌


గ్రామ అవసరాలకే వినియోగిస్తున్నాం..

చింతలమానేపల్లి : ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్‌ను గ్రామ అవసరాల మేరకే వినియోగిస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లోని చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించడంతో పాటు హరితహారం మొక్కలకు నీటిని పోసేందుకు వినియోగిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అన్ని పంచాయతీలకు ఈ ట్రాక్టర్లను అందజేసి ఎంతో మేలు చేసింది. పల్లెలను ఆదర్శంగా తయారుచేసుకోవడంలో భాగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇలా మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అదే పని చేసింది. ముఖ్యంగా గ్రామంలో పారిశుధ్యలోపం లేకుండా చెత్తను తరలించేందుకు ఇలా ట్రాక్టర్‌ను అందజేయడం మంచి నిర్ణయం.          - గోమాజి విలాస్‌, సర్పంచ్‌, గంగాపూర్‌ 


నిత్యం మొక్కలకు నీరందిస్తున్నాం..

రెబ్బెన: పంచాయతీకో ట్రాక్టర్‌ ఉండాలని రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం భేష్‌. గ్రామంలో పారిశుధ్య పనులకు, చెత్త తరలించేందుకు ఈ ట్రాక్టర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ట్రాలీతో పాటు ట్యాంకర్‌ను అందజేసిన్రు. ఈ ట్యాంకర్‌ ద్వారా నిత్యం హరితహారం ద్వారా నాటిన మొక్కలకు నీరు పోస్తున్నాం. పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తున్నది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శంగా తయారవ్వడం ఖాయం. బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయడంలో ఇదో ముందడుగని అనుకుంటున్నా.                                        -చెన్న సోమశేఖర్‌, నంబాల సర్పంచ్‌   


ట్రాక్టర్‌తో చెత్త తరలిస్తున్నాం..

పెంచికల్‌పేట్‌ : గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ట్రాక్టర్‌ను అందజేయడం ఆనందంగా ఉంది. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను ఇప్పుడు పరిష్కరించుకోవచ్చు . ప్రధానంగా పారిశుధ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వలేవి పల్లెల అభివృద్ధికి తీసుకున్న చర్యలేమి లేవు. ప్రధానంగా పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం, పారిశుధ్యానికి చర్యలు కూడా చేపట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే కాకుండా, పల్లెల రూపురేఖలు మార్చేందుకు ఎంతో చేస్తున్నది. ప్రస్తుతం ఈ ట్రాక్టర్‌ ద్వారా గ్రామంలో చెత్తను తరలిస్తున్నాం.                                              -సాద్గరి దేవాజీ, దరొగపెల్లి సర్పంచ్‌ 


గ్రామాలకు ఎంతో ప్రయోజనం..

దహెగాం : ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లు గ్రామాల అభివృద్ధిలో ఎంతో ఉపయోగ పడుతున్నాయి. వారంలో మూడు రోజులు చెత్తాచెదారాన్ని ఈ ట్రాక్టర్‌ ద్వారానే తరలిస్తున్నాం. అదేవిధంగా ఇతర పనులకు కూడా గ్రామ అవసరాలకు ఉపయోగ డుతుంది. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ట్రాక్టర్లను అందజేసింది. ట్రాక్టర్‌ ఉండడంతో అదనపు ఖర్చులు తగ్గించుకోగలిగాం. చెత్తను తరలించడం పంచాయతీ కార్మికులకు ఎంతో సులువవుతున్నది. ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఈ ట్రాక్టరును అందజేసిందనుకుంటున్న.             - జర్పుల శ్యామల, కమ్మర్‌పల్లి సర్పంచ్‌ 


logo