సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 15, 2020 , 00:02:23

సబ్సిడీపై కూరగాయల విత్తనాలు

సబ్సిడీపై కూరగాయల విత్తనాలు

భీమిని(కన్నెపల్లి) : సంప్రదాయ పంటల కంటే కూరగాయల సాగే మేలంటున్న కొందరు రైతులు. విత్తనాలతో పాటు పందిరి, పూలసాగు కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్లతో పంటలు నష్టపోయే రైతులు వేసవిలో లాభసాటిగా ఉండే కూరగాయల సాగుపై మళ్లుతున్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తెచ్చిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుండడంతో వారి సూచనలు పాటిస్తూ ఏయే పంటలు వేయాలో తెలుసుకొంటున్నారు. అంతేగాక ఎన్నో పథకాల ద్వారా సబ్సిడీని ఇస్తోంది. ముఖ్యంగా పందిరి జాతి, పూల సాగు కోసం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. రైతులు కూడా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్లు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో పంటకు నష్టాలు తప్ప డం లేదు. ఈ క్రమంలో పత్తి, వరి, లాంటి సంప్రదాయ పంటలను సాగుచేస్తూ ఆర్థికంగా చితికిపోతున్న రైతులు క్రమంగా కూరగాయల వైపు మళ్లుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని అధికారులు చెబుతుండడంతో వేసవిలో కూరగాయలు సాగుచేస్తున్నామని యువ రైతులు చెబుతున్నారు.

డిసెంబర్‌ నుంచే సాగు..

భీమిని మండలం బారేగూడెం కాలనీలో రైతులు ఏటా తమకున్న కొద్దిపాటి పొలంలో టమాట, బెండ, బీర, వంకాయ, చిక్కుడు పంటలను వేస్తున్నారు. ఖరీఫ్‌, రబీలతో పోల్చితే వేసవిలో దిగుబడులు తక్కువగా వస్తుండడంతో ఇక్కడ డిసెంబర్‌ నుంచే సాగు పనులు మొదలుపెడితే మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. అలాగే తక్కువ వ్యవధిలో సాగయ్యే హైబ్రిడ్‌ రకాలను ఎంచుకొంటున్నారు. కాలనీకి చెందిన మోర్ల వెంకటేశ్‌ తనకున్న రెండెకరాల్లో వంకాయ, టమాట, చిక్కుడు, బీర, బెండ, పసుపు, మక్కజొన్న పంటలను సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు.

చీడపీడలు తక్కువ

వేసవిలో సాగు చేసే కూరగాయలైన టమాట, బెండకాయ, బీరకాయ, వంకాయ పంటలకు ఉష్ణోగ్రత, గాలిలో తేమతో చీడపీడలు పంటలపై ఎక్కువ వ్యాప్తి చెందవు. దీంతో పంటలకు రసాయన మందులను తక్కువ వాడతామని, దీంతో దిగుబడులు వస్తున్నాయంటున్నారు.

కూరగాయల పొలం తయారీ..

కూరగాయలు సాగుచేసే పొలంలో ప్రధాన పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు మెత్తని దుక్కి వచ్చే వరకు దున్నుకోవాలి. పశువుల ఎరువులను కలియ చల్లి దున్నుకోవాలి. సాగు విధానాన్ని బట్టి పొలాన్ని బోదెలుగా లేదా చిన్న చిన్న మడులుగా తయారు చేసుకోవాలి. వంకాయ, టమాట, బెండ లాంటి కూరగాయలను బోదెలు, కాలువల పద్ధతుల్లో నాటుకోవాలి. వరుసల మధ్య దూరాన్ని బట్టి నీటి బోదెలను 40సెంటీమీటర్ల వెడల్పుతో బోదెల గట్లపై విత్తుకోవాలి. వేసవికి అనువైన కూరగాయలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అనంతరం పండించిన కూరగాయలను బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి కూరగాయల మార్కెట్‌లకు తరలిస్తుండడంతో భీమినిలో గురువారం జరిగే సంతలో కూరగాయలు విక్రయిస్తున్నారు.


logo