బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 00:09:39

చురుకుగా జాతీయ రహదారి పనులు

చురుకుగా జాతీయ రహదారి పనులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సరిహద్దు నుంచి మహారాష్ట్ర రాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా వరకు ఫోర్‌లేన్‌ పనులు చురుకుగా కొనసాగనున్నాయి. నిర్మాణానికి రూ.1,503 కోట్లు కేటాయించారు. ఈ రహదారి నిర్మాణం వల్ల అధిక నష్టం జరగకుండా గ్రామాలు ఉన్న ప్రాంతాల్లో విస్తీర్ణం తగ్గించి, ఇతర ప్రాంతాల్లో కొంత వెడల్పుతో నిర్మాణం చేపట్టనున్నారు. శ్రీరాంపూర్‌ సింగరేణి జీఎం కార్యాలయం పక్క నుంచి బైపాస్‌గా మళ్లిస్తారు. అక్కడి నుంచి నేరుగా క్యాతన్‌పల్లి అనుసంధానం చేస్తారు.అక్కడి నుంచి మందమర్రి, సోమగూడెం చౌరస్తా మీదుగా ఈ రహదారి సాగనుంది. బెల్లంపల్లి వద్ద బైపాస్‌ ఏర్పాటు చేస్తారు. మొత్తం 16 అండర్‌ వెహికిల్‌ పా సింగ్‌ బ్రిడ్జీలను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

భూ సేకరణ పూర్తి... నష్టపరిహారం చెల్లింపు.. 

రహదారి నిర్మాణం కోసం 268.217 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించి పూర్తి స్థాయిలో భూ సేకరణ చేశారు. ఈ క్రమంలో భూమితోపాటు ఇండ్లను కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందిస్తున్నారు. శ్రీరాంపూర్‌, క్యాతన్‌పల్లి, మందమర్రి, సోమగూడెం, బెల్లంపల్లి, తాండూరు ప్రాంతాల్లో ఎవరైతే భూమితోపాటు ఇండ్లను కోల్పోతున్నారో వారికి నష్టపరిహారం అందిస్తున్నారు. 16 అండర్‌ వెహికల్‌ పాసింగ్‌ బ్రిడ్జీలతోపాటు క్యాతన్‌పల్లి వద్ద ఒక బైపాస్‌, బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌ ప్రాంతం నుంచి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖాన వరకు మరో బైపాస్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మందమర్రి, సోమగూడెం మధ్యలో టోల్‌గేట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి గుజరాత్‌కు చెందిన అదాని కంపెనీకి ప్రభుత్వం టెండర్లు అప్పగించింది.   జిల్లాలో పెగ్‌ మార్కింగ్‌ చేసి కావాల్సిన భూములు, చెల్లించాల్సిన నష్టపరిహారం వివరాలతో రెవెన్యూ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 

తీరనున్న ప్రయాణ వెతలు

రహదారి పొడవు మొత్తం 94.6 కిలోమీటర్లు కాగా, జిల్లాలో 42 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. ప్రస్తుతం ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా మంచిర్యాల నుంచి రామకృష్ణాపూర్‌, మందమర్రి వరకు కూడా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందారం మూల మలుపు నుంచి తాండూరు మండలం రేపల్లే వాడ వరకు చేపట్టనున్న ఫోర్‌లేన్‌ రహదారితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడనుంది. నిత్యం హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌తోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా వేలాది లారీలు, బస్సులు, ఇతర వాహనాలు మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి  నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌ వెళ్తుంటాయి. ప్రస్తుతం మంచిర్యాల నుంచి తాండూరు వెళ్లేందుకు బస్సులో దాదాపు గంటన్నర సమయం పడుతోంది. రహదారి పనులు పూర్తయితే అరగంటలో వెళ్లవచ్చు. దాదాపు గంట సమయం ఆదా అవుతుంది. ప్రమాదాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

చురుకుగా సాగుతున్న పనులు..

దాదాపు రెండు నెలలుగా పనులు చురుకుగా సాగుతున్నాయి. మొదట ఈ రోడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున చెట్లు కొట్టే కార్యక్రమాలు చేపట్టారు. మొదట వీటికి సంబంధించి సర్వే చేసిన నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు చెట్లకు మార్కింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని తొలగించడం వాటిని జాగ్రత్తగా తరలించడం చేశారు. ఇప్పుడు రోడ్డు పక్కన మట్టి తొలగింపు, అందులో మట్టి వేసి చదును చేసే కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు మట్టిని తొలగించడంతోపాటు, మరోవైపు రోడ్డు రోలర్‌తో చదును చేస్తున్నారు. బెల్లంపల్లి 68 డిప్‌ ఏరియాలో పనులు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీకి సంబంధించి మేడారం ప్రాంతంలో క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పనులు అన్నీ చకచకా సాగుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


logo