ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 14, 2020 , 00:08:38

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ నెల 15న సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) కృష్ణ తెలిపారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇం టర్వ్యూ ఇచ్చిన ఆయన, పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 12 సహకార సంఘాల పరిధిలో 3 సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయనీ, మిగతా 9 సంఘాల పరిధిలోని 42 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నమస్తే : సహకార ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీసీవో : జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాలోని 12 సహకార సంఘాల పరిధిలో కెరమెరి, తిర్యాణి, కాగజ్‌నగర్‌ (కొత్తపేట) సంఘాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. ఈ మండలాల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగతా 9 మండలాల్లోని 42 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకు కావాల్సిన బ్యాలెట్‌ బాక్స్‌లు, సిబ్బందిని నియమించాం. శుక్రవారం జిల్లా కేంద్రంలో బాలుర హైస్కూల్‌లో ఇందుకు కావాల్సిన సామగ్రి పంపిణీ చేస్తాం. ప్రశాంత వాతావరణంలో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

నమస్తే : ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?

డీసీవో : ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి స్థానానికీ ఒక బ్యాలెట్‌ బాక్స్‌ ఉంటుంది. జిల్లాలో జరగబోయే 42 కేంద్రాల్లో 116 మంది సిబ్బందిని నియమించాం. దీంతో పాటు ఒక్కో పోలింగ్‌ కేంద్రం వద్ద 10 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. 

నమస్తే : 42 స్థానాల పరిధిలో ఎంత మంది పోటీ పడుతున్నారు?

డీసీవో : జిల్లాలోని 12 సహకార సంఘాల్లో మూడు ఏకగ్రీవాలు అయ్యాయి. మిగతా 9 సహకార సంఘాల్లో కూడా 74 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ 9 సంఘాల్లో మిగిలిన 42 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ 42 స్థానాల్లో 91 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికలు నిర్వహించనున్న వార్డుల స్థానాల పరిధిలో 5,764 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేశాం.

నమస్తే : పోలింగ్‌ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు?

డీసీవో : జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పోలింగ్‌ కేంద్రాలను అన్ని మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశాం. ఆసిఫాబాద్‌, వాంకిడి, రెబ్బెన, జైనూర్‌, బూర్నూర్‌(సిర్పూర్‌-యు), సిర్పూర్‌-టి, దహెగాం, గురుడుపేట్‌(కౌటాల), బెజ్జూర్‌ మండల కేంద్రాలోని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రంలో ముగ్గురు పోలింగ్‌ సిబ్బంది ఉంటారు.

నమస్తే : ఎన్నికలు జరిగే సంఘల పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు?

డీసీవో : జిల్లాలోని 9 సహకార సంఘాల్లోని 42 వార్డుల పరిధిలో 5764 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఆసిఫాబాద్‌ మండలంలో ఎన్నికలు జరిగే 5 వార్డుల పరిధిలో ఒక్కో వార్డుకి 102 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. వాంకిడి మండలంలోని 5 వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 81 మంది చొప్పున, రెబ్బెన మండలంలో ఎన్నికలు జరిగే రెండు వార్డుల్లో ఒక్కో వార్డులో 165 మంది ఓటర్లు, జైనూర్‌ మండలంలో ఎన్నికలు జరిగే రెండు వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 60 మంది చొప్పున, బూర్నూర్‌(సిర్పూర్‌-యు) మండలంలో ఎన్నికలు జరిగే మూడు వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 38 మంది ఓటర్లచొప్పున, సిర్పూర్‌-టి మండలంలో ఎన్నికలు జరిగే 5 వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 152 మంది ఓటర్ల చొప్పున, దహెగాం మండలంలో ఎన్నికలు జరిగే 5 వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 117 మంది ఓటర్లు చొప్పున, గురుడుపేట్‌(కౌటాల) సంఘం పరిధిలో ఎన్నికలు జరిగే 6 వార్డుల పరిధిలో 162 మంది ఓటర్ల చొప్పున, బెజ్జూర్‌ మండలంలో ఎన్నికలు జరిగే 9 వార్డుల పరిధిలో ఒక్కో వార్డులో 216 మంది ఓటర్ల చొప్పున ఉన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటరు ప్రభుత్వం గుర్తింపు పొందిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక కార్డుని వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది.


logo