మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 23:31:55

కల్యాణ వైభోగమే..

కల్యాణ వైభోగమే..

బెజ్జూర్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌ : మండలంలోని సోమిని శివారు ప్రాణహిత నదీతీరం ఎర్రబండ రేవు వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో సామూహిక వివాహా మహోత్సవం అట్టహాసంగా సాగింది. మాజీ ఎంపీ నగేశ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆసిఫాబాద్‌ జడ్పీ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి ఈ కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకలో భాగంగా 124 జంటలు ఏకమవ్వగా, ప్రాంగణమంతా వేదమంత్రాల ఉచ్ఛరణతో మార్మోగింది. తొలుత 15 మంది వేద పండితులు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బజాభజంత్రీలతో వేదిక వద్దకు తీసుకెళ్లారు. ముందుగా సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ వేదికలో మంగళసూత్రాలకు గౌరీ, వినాయకుడి పూజ చేశారు. అనంతరం మట్టెలు, మంగళసూత్రాలు వధూవరులకు అందజేశారు. స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తర నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుమూహర్తం మధ్యాహ్నం గం. 12.16 నిమిషాలకు 124 జంటలు పెళ్లి ద్వారా ఏకమయ్యాయి. అతిథులతో కలిసి ఎమ్మెల్యే కోనప్ప, రమాదేవి దంపతులు నూతన వధూవరులపై అక్షింతలు చల్లి, నిండు నూరేళ్లు సల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల రాకతో కళ్యాణ వేదిక కిక్కిరిసింది. అంతకుముందు జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఇంతటి మహాక్రతువును నిర్వహించిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. వారందరినీ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ కోనప్ప చేపడుతున్న సేవా కార్యక్రమాలు కలకాలం నిలిచిపోతాయన్నారు. ఎన్నో పేద కుటుంబాలకు కోనప్ప అండగా నిలవడం అభినందనీమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 6 వేల మంది భోజన వసతి ఏర్పాటు చేశారు. పెంచికల్‌పేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. జంటలకు ఎంపీడీవో రాజేందర్‌ ఆధ్వర్యంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు క్రిష్ణారావు, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌, కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కోనేరు వంశీ క్రిష్ణ, కౌటాల సీఐ శ్రీనివాస్‌, తాసిల్దార్‌ రవీందర్‌, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అర్షద్‌ హుస్సేన్‌, జిల్లా సభ్యుడు కొండ్ర జగ్గాగౌడ్‌, గిరిజన నాయకులు కుర్సింగ ఓంప్రకాష్‌, సిడాం సకారాం, ఆలం అనిల్‌, ఎలాది శేఖర్‌, సర్పంచులు, ఎంపీటీసీ దాతలు, తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>