బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:45:46

సౌకర్యాలు కల్పించాలి

సౌకర్యాలు కల్పించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌ : ఇంటర్‌, పదోతరగతి వార్షిక పరీక్షలు త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. మార్చి 4వ తేదీన ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానుండగా, ఆదివారం పట్టణంలోని బాలభారతి, వివేకానంద, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలూ కల్పించాలన్నారు. బాలభారతి పరీక్షా కేంద్రం అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. అలాగే తరగతిగదిలో చిన్నచిన్న బెంచీలు ఉండడం చూసి, ఒక్క బెంచీపై ఇద్దరు ఎలా కూర్చుండి పరీక్ష రాస్తారని నోడల్‌ అధికారి గోపాల్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. ఒకరికొకరు చూసి రాసే అవకాశం ఉంటుందని స్వయంగా కూర్చుండి చూపించారు. గదుల్లో చీకటిగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులుపడాల్సి వస్తుందనీ, విద్యుత్‌, మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలుపాలని సూచించారు. ఎస్పీఎం పేపర్‌ మిల్లుకు వచ్చే లారీలను పరీక్షా కేంద్రాల ఎదుట నిలుపకుండా చూడాలనీ, లేకపోతో విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రానికి అతి సమీపంలోనే మూత్రశాలలు ఉండేలా చూడాలని సూచించారు. లేకపోతే బయోటాయిలెట్స్‌ కోసం మున్సిపల్‌ కమిషనర్‌ను సంప్రదించి ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ సుమన్‌కు సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కల్యాణి, నరసింహారెడ్డి, తదితరులు ఉన్నారు. 

దహెగాం కళాశాల ఆకస్మిక తనికీ..

దహెగాం : దహెగాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్‌ పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల విద్యాబోధన, సౌకర్యాల గురించి ప్రిన్సిపాల్‌ కన్నం మోహన్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కళాశాల అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సందర్శించి, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యాబోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్తులు శ్రద్ధతో చదివి మంచి ప్రయోజకులు కావాలని కోరారు. అలాగే విద్యతో పాటు అన్ని శాఖలపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. 


logo
>>>>>>