గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , T00:30

ఏకగ్రీవాల జోరు

ఏకగ్రీవాల జోరు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికల నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. మొదటి రెండు రోజులు నత్తనడకన సాగిన నామినేషన్ల పర్వం.. చివరి రోజున పెద్ద ఎత్తున సాగింది. కేంద్రాల వద్ద సందడి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా 12 సంఘాల పరిధిలో మొదటి రెండు రోజులు 90 నామినేషన్లు రాగా, చివరి రోజు 252 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 342కు చేరింది. ఆసిఫాబాద్‌ మండలంలో 28 నామినేషన్లు, వాంకిడి మండలంలో 27, రెబ్బెనలో 35, తిర్యాణిలో 13, కెరమెరిలో 13, జైనూర్‌లో 33, బూర్పూర్‌(సిర్పూర్‌-యు)లో 25, కొత్తపేట్‌ (కాగజ్‌నగర్‌)లో 28, సిర్పూర్‌-టిలో 30, దహెగాంలో 37, గురుడుపేట్‌ (కౌటాల)లో 37, బెజ్జూర్‌లో 36 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

48 వార్డుల్లో సింగిల్‌ నామినేషన్లు..

జిల్లాలోని 12 సహకార సంఘాల పరిధిలో 156 వార్డులు ఉన్నాయి. వీటిలో 48 వార్డులకు కేవలం సింగిల్‌ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆసిఫాబాద్‌ మండలంలో 4 వార్డులు, వాంకిడి మండలంలో 4, రెబ్బెన మండలంలో 2, తిర్యాణి మండలంలో 13, కెరమెరి మండలంలో 13, జైనూర్‌ మండలంలో 1, సిర్పూర్‌-యు(బూర్నూర్‌)లో 4, కొత్తపేట్‌(కాగజ్‌నగర్‌) లో 1, సిర్పూర్‌-టిలో 4, దహెగాంలో 1, గురుడుపేట్‌(కౌటాల)లో ఒక నామినేషన్‌ మాత్రమే వచ్చింది. సింగిల్‌ నామినేషన్ల వచ్చిన వార్డులన్నీ ఏకగ్రీవం కానున్నాయి.

కెరమెరి, తిర్యాణి సొసైటీలు టీఆర్‌ఎస్‌ వశం 

కెరమెరి మండలంలోని 13 వార్డుల్లో కేవలం 13 నామినేషన్‌లు, తిర్యాణి మండలంలోని 13 వార్డుల్లో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రెండు మండలాల్లోని సహకార సంఘాల్లోని వార్డుల్లో ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుం డా పోయింది.  దీంతో కెరమెరి, తిర్యాణి సహకార సంఘాలు దాదాపు టీఆర్‌ఎస్‌ వశమైనట్లే. బెజ్జూర్‌ మండలంలో మాత్రం ఒక్క వార్డు కూడా ఏగ్రీవం కాలేదు.

అత్యధికం టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల జాబితా పరిశీలిస్తూ అనుకూలంగా ఎంతమంది.. ఎన్ని ఓట్లు వస్తే గెలుస్తామనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. అత్యధికం టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.


logo