గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , T00:10

సింగరేణి సీఅండ్‌ఎండీకి ‘భారతీయ మహంతం పురస్కార్‌'

  సింగరేణి సీఅండ్‌ఎండీకి ‘భారతీయ మహంతం పురస్కార్‌'

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ప్రముఖ ఏషియా వన్‌ మ్యాగజైన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌)లో జరిగిన 13 వ ఏషియన్‌ బిజినెస్‌ అండ్‌ సోషల్‌ ఫోరం సదస్సులో సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రతిష్టాత్మక ‘భారతీయ మహంతం పురస్కార్‌ 2019-20, ద లీడర్‌' అవార్డును స్వీకరించారు. థాయ్‌లాండ్‌ నుంచి ప్రచురితం అవుతున్న ప్రముఖ ఏషియా వన్‌ పత్రిక వారు ఆసియా దేశాల్లో వ్యాపార, వాణిజ్య పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతాభావంతులైన సీఈఓలకు ఇచ్చే ఈ అవార్డుకు ఈసారి సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ను ఎంపిక చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకాక్‌లోని మారియట్‌ మార్కిస్‌ హోటల్‌లో అత్యంత వైభవోపేతంగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మొరాకో దేశ రాయబారి అబ్దెలిల్లామ్‌ అల్‌ హోస్నే, మాల్దీవ్స్‌ రాయబారి మహ్మద్‌ జిన్నాల చేతుల మీదుగా సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ అవార్డును స్వీకరించారు.  

 అత్యధిక వృద్ధి రేటుతోనే అవార్డు..

 సింగరేణి సంస్థను గత ఐదేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించిన కంపెనీగా నిలిపినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందచేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్‌. శ్రీధర్‌ సారథ్యంలో సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిపై ఒక వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు. సింగరేణి గత ఐదేండ్ల కాలంలో అమ్మకాల్లో 78 శాతం వృద్ధి, లాభాల్లో 262 శాతం వృద్ధి, బొగ్గు రవాణాలో 28 శాతం వృద్ధి, బొగ్గు ఉత్పత్తిలో 23 శాతం వృద్ధి సాధించిందనీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ తన ప్రతిభావంత నాయకత్వంతో కంపెనీని ఉన్నత స్థాయికి చేర్చాడని ఆయన కృషిని, ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

 అభివృద్ధి పథంలో అందనంత దూరం.. 

 తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి సంస్థ, సీఅండ్‌ఎండీ బాధ్యతలు చేపట్టిన ఎన్‌. శ్రీధర్‌ తన అసమాన ప్రతిభాపాటవాలతో సింగరేణిని అన్ని విభాగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 2014తో పోలిస్తే ఐదేళ్లలో సింగరేణి సంస్థ తన విక్రయా లను 14,078 కోట్ల రూపాయల నుంచి  25,071 కోట్ల రూపాయలకు (78 శాతం వృద్ధి), లాభాలను 490 కోట్ల రూపాయల నుంచి 1,767 కోట్ల రూపాయలకు (262 శాతం వృద్ధి), బొగ్గు రవాణాను 58 మిలియన్‌ టన్నుల నుంచి 68 మిలియన్‌ టన్నులకు (28 శాతం వృద్ధి), బొగ్గు ఉత్పత్తిని 52 మిలియన్‌ టన్నుల నుంచి 62 మిలియన్‌ టన్నులకు (23 శాతం వృద్ధి), పెంచుకుని సింగరేణి చరిత్రలోనే అత్యధిక రికార్డు సాధించింది. అమ్మకాలు లాభాల  వృద్ధి రేటులో సింగరేణి దేశంలోని మహారత్న కంపెనీలతో పాటు దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కన్నా అభివృద్ధిలో ముందు నిలిచింది. 

 అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సింగరేణి...

 కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే ఉన్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలోకి ప్రవేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంలో ఎన్‌. శ్రీధర్‌ విశేషమైన కృషి చేయడంతో ఆ రంగాల్లో కూడా దూసుకుపోతోంది. జైపూర్‌ పవర్‌ప్లాంట్‌లో 1200 మెగావాట్ల సింగరేణి  థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని  వేగవంతంగా పూర్తి చేశారు. కాబట్టి రాష్ట్ర థర్మల్‌ విద్యుత్‌ వినియోగంలో 20 శాతం విద్యుత్‌ను ఈ కేంద్రం అందించగలుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా తొమ్మిది ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలను స్థాపించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. తొలిదశ 219 మెగావాట్లలో 5 మెగావాట్ల ప్లాంటు (ఎస్‌టీపీపీ) ఇప్పటికే ప్రారంభించారు. సోలార్‌, థర్మల్‌ విద్యుత్‌ రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి ఖ్యాతి వహించడంలో శ్రీ ధర్‌ చొరవ ప్రశంసనీయమని అధికారులు చెబుతున్నారు. 

 ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు..

 సింగరేణి సాధిస్తున్న బహుముఖ ప్రగతిని పరిగణలోకి తీసుకుని పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌కు, సంస్థకు పలు ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీ అవార్డు (యు.ఎస్‌.ఏ), మేనేజర్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు -2018(లండన్‌), అవుట్‌ స్టాండింగ్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు -2018 (దుబాయ్‌), ఏషియా పసిఫిక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ అవార్డు (ఎంటర్‌ ప్రైజ్‌ ఏషియా), గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు (దుబాయ్‌) అవార్డులను శ్రీధర్‌ అందుకున్నారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. 


logo
>>>>>>