సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 08, 2020 , 01:50:47

జోరుగా సహకార నామినేషన్లు

జోరుగా సహకార నామినేషన్లు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార నామినేషన్‌లు పర్వం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆసక్తిగా రైతులు పెద్ద సంఖ్యల తరలివచ్చి నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్‌ల సమర్పణకు చివరి రోజైన శనివారం పెద్ద సంఖ్యలో మరిన్ని నామినేషన్‌ల దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజు మైదాన ప్రాంత మండలాలైన దహెగాం, కౌటాల, జైనూర్‌, వాంకిడి, రెబ్బెన, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌-టి , ఆసీఫాబాద్‌ మండలాల్లో నామినేషన్‌లు దాఖలు కాగా రెండో రోజు జిల్లాలోని 12 మండలాల్లో నామినేషన్‌లు వేశారు. శుక్రవారం జైనూర్‌ మండలంలో 5 నామినేషన్‌లు, కెరమెరి మండలంలో 2, వాంకిడిలో 4, సిర్పూర్‌-యులో 7, రెబ్బెనలో ఒకటి, ఆసీఫాబాద్‌లో 12, తిర్యాణిలో రెండు, కాగజ్‌నగర్‌లో 11, సిర్పూర్‌-టిలో 6, కౌటాలలో 8, బెజ్జూర్‌లో 5, దహెగాంలో 9 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. నామినేషన్‌లు ప్రారంభమైన మొదటి రోజు నత్తనడకన సాగిన నామినేషన్‌లు ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. 

నేటితో ముగియనున్న గడువు

సహకార ఎన్నికల నామినేషన్‌ల గడువు ఈనెల 8 శనివారంతో ముగియనుంది. సహకార ఎన్నికలను మైదాన ప్రాంత మండలాల్లో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. తమకు తమకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారనే విషయాలను బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా నామినేషన్‌లు వేయాలని భావిస్తున్నారు. జిల్లాలోని 12 సహకార సంఘాల పరిధిలో 156 వార్డులు ఉన్నాయి. శనివారం అన్ని వార్డులోను నామినేషన్‌లు దాఖలయ్యే అవకాశం ఉంది.


logo