సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 06, 2020 , 01:16:15

మూడో లైనుకు రూ.483 కోట్లు

మూడో లైనుకు రూ.483 కోట్లు
  • కాజీపేట-బల్లార్షకు నిధుల కేటాయింపు
  • అటకెక్కిన రైళ్ల హాల్టింగ్‌, కొత్త రైళ్ల ప్రతిపాదనలు
  • ఊసేలేని నాలుగో లైను, మంచిర్యాల-గడ్చిరోలి సర్వే

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ): రైల్వే బడ్జెట్‌లో కాజిపేట - బల్లార్షా మధ్య మూడో లైనుకు నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల ఒకటిన రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వేకు కేటాయించిన మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతర గ్రాంటులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో కాజిపేట - బల్లార్షకు మూడో లైను కింద రూ. 483 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 201.4 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే లైను నిరంతరం రద్దీగా ఉంటుంది. పవర్‌ ప్లాంట్లు, బొగ్గు, సిమెంటు రవాణా, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. అయితే అదనపు లైను లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమకు రైళ్లు పెంచాలని, రవాణా పరమైన ఇబ్బందులు అవుతున్నాయని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో మంచిర్యాల ఎంపీ విజ్ఞాపనలు అందజేశారు. 


రూ. 2063 కోట్లతో అంచనా వ్యయం.. 

కాజీపేట - బల్లార్షా మధ్య మూడో లైన్‌ డిమాండ్‌ తరచూ వినిపిస్తుండటంతో 2015-16లో కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 201.4 కిలో మీటర్లు పొడవున్న ఈ లైను నిర్మాణానికి  అంచనా వ్యయం రూ. 2063 కోట్లుగా నిర్ధారించింది. ఐదేండ్లలో ఈ మూడవ లైను ప్రాజెక్టు పూర్తి చేయాలని భా వించారు. అదే విధంగా 2017లో మూడో లైను కోసం 160 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నా లుగో లైనుకు సర్వే చేయాలని భావించింది. అదే విధంగా మంచిర్యాల గడ్చిరోలికి సర్వే చేయాలని భా వించగా అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఐదేండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు సరైన కేటాయింపులు లేక ముందుకు సక్రమంగా సాగలేదు. దీంతో మరో రెండు, మూడేండ్లు పట్టే అవకాశం ఉంది. 


ఈ బడ్జెట్‌లో రూ. 483 కోట్లు కేటాయింపు...

రాఘవపురం, పొత్కపల్లి, బిజగిరీషరీఫ్‌, ఉప్పల్‌, వీరూరు, మణిక్‌ఘర్‌లో పనులు పూర్తయ్యాయి. మిగితా చోట్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020-2021 రైల్వే బడ్జెట్‌లో రూ. 483 కోట్లు విడుదల చేసింది. దీంతో పనులు చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేదని పలువురు కోరుతున్నారు. అంతే కాకుండా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైళ్ల హాల్టింగ్‌, కొత్త రైళ్ల ప్రతిపాదన చెవికి ఎక్కించుకోలేదు. నాలుగో లైను సర్వే, మంచిర్యాల -గడ్చిరోలి సర్వేపై కనీస దృష్టి పెట్టలేదు


logo