గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 03, 2020 , 03:43:57

మార్పుతోనే ప్రమాదాల నివారణ

మార్పుతోనే ప్రమాదాల నివారణ

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ మార్పు ప్రజల నుంచే ప్రారంభమవ్వాలని జిల్లా రవాణాశాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆదివారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కొద్ది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తున్నదన్నారు. మానవ తప్పిదాలతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. 


ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, వాహన చోదకుల బాధ్యతా రాహిత్యం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పెద్ద సంఖ్యలో యువతే మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు బాధ్యతాయుతంగా సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించి, ఆసిఫాబాద్‌ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సహకరించాలని కోరారు. అనంతరం 30 ఏళ్లలో ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లను సన్మానించారు. వారిలో ఎండీ గౌస్‌, కలీం, విట్టల్‌ ఉన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు చంద్రశేఖర్‌, రాహుల్‌ కుమార్‌, ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి, అసిస్టెంట్‌ డీఎం దేవపాల, రవాణా శాఖ సిబ్బంది సంతోశ్‌, వాజిద్‌, మాజిద్‌, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు, తదితరులు ఉన్నారు. 


logo