శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 23:05:34

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌!

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌!
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 325 మంది ఉద్యోగులు
  • మూడొంతుల మంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
  • 197 మంది వీఆర్‌ఎస్‌.. మిగిలింది 128 మంది..

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భారతదేశంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ కోల్పోతున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన ముఖ్యమైన సేవా సంస్థ అయినటు వంటి భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) ఇక కనుమరుగు కానుందనే విమర్శలు వస్తున్నాయి. నష్టాల నివారణ సాకుగా చూపి ఉద్యోగులను తొలిగించే చర్యలు చేపట్టారు. క్రమక్రమంగా ప్రైవేటు పరం చేసి.. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలు చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలతో ఎంతో అనుబంధం, సత్సంబంధాలు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రమంగా జనాలకు దూరం కానుంది. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చేలా, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యత క్రమంగా తగ్గిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇప్పటికే దేశంలో జాతీయ బ్యాంకుల విలీనం పేరిట బ్యాంకింగ్‌ రంగాన్ని మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందనే విమర్శలు వస్తున్నాయి. రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానిస్తూ ప్రజా, సరకు రవాణాను తీరని భారంగా మార్చబోతోంది. ఎల్‌ఐసీలోని ప్రభుత్వ వాటాలను అమ్మేందుకు నిర్ణయించినట్లు తాజా బడ్జెట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే ఎయిరిండియా అమ్మకానికి పెట్టింది. తాజాగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేసింది. క్రమంగా టెలికాం రంగం నుంచి కేంద్రం దూరమై.. ప్రైవేటు చేతికి పెత్తనం అప్పగించేందుకు సిద్ధమైంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాల నివారణ పేరుతో తీసుకొచ్చిన వీఆర్‌ఎస్‌ పథకం జనవరి 31తో అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం ఉద్యోగుల్లో మూడొంతుల మందికి పదవీ విరమణ లభించింది.


భారం తగ్గించుకునేందుకే..

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సంపాదన కంటే ఉద్యోగుల జీతాభత్యాలు అదనంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో సంస్థపై అదనపు భారం పడటంతో సకాలంలో ఉద్యోగులకు జీత భత్యాలను చెల్లించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలో నడిపించడానికి కేంద్రం ప్రభుత్వం వీఆర్‌ఎస్‌ స్కీంను తీసుకొచ్చిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించి.. తక్కువ ఖర్చుతో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో దీన్ని నడిపించడానికి నిర్ణయించారని చెబుతున్నారు. సర్వీస్‌తో సంబంధం లేకుండా 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని జీఓను విడుదల చేస్తూ.. ప్యాకేజీని ప్రకటించింది. 


50 ఏళ్లు దాటిన వారు ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తికాలం వేతనంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించడంతో.. అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. విరమణ పొందిన ఉద్యోగులకు మిగిలి ఉన్న సర్వీస్‌ కాలం మొత్తం జీతభత్యాలను మూడు దఫాలుగా చెల్లిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 325 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. తాజాగా వచ్చిన జీవోతో 197మంది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఐదింటా మూడొంతుల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకోగా.. ఈ ప్రక్రియ పూర్తయినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు. 


అయిష్టంగానే వీఆర్‌ఎస్‌

చాలా మందికి వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయినప్పటికీ.. అర్హత ఉన్న ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం పేర్కొనడం తో గత్యంతరం లేక వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన వారందరికీ ఉద్యోగ విరమణ కోసం ఆదేశాలు వెలువడటంతో.. ఉమ్మడి జిల్లాలో మూడొంతుల మంది సిబ్బంది ఖాళీ అయ్యారు. చాలా అయిష్టంగానే ఉద్యోగాలను వీడారు. యాభై ఏళ్లలోపు ఉన్న వారంతా తమ సర్వీసుల్లో కొనసాగనున్నారు. 325 మందిలో 197 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకోగా.. మిగతా 128 మంది ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారు. 


వీఆర్‌ఎస్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇంటిముఖం పట్టిన వారి స్థానాల్లో తాత్కాలిక సేవలకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ప్రకటించింది. అవకాశం ఉన్న విభాగాలకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని తీసుకోబోతున్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో యథావిధిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికాం సేవలు కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌, ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.


logo