బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 04:17:03

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు రెడీ

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు రెడీ
  • నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
  • 18 కేంద్రాలు.. 3346 మంది విద్యార్థులు
  • మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌
  • నిఘా నీడలో నిర్వహణ

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా జిల్లాలో 18 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నది. కాపీయింగ్‌ను నిరోధించేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ పరీక్షలను గత రెండేళ్లుగా ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్‌ జరిగే కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లోనైతే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లోనైతే ఆయా పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు.

సత్ఫలితాలు ఇస్తున్న నూతన విధానం

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహింస్తోంది. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాపీయింగ్‌ నిరోధించేందుకు ఆన్‌లైన్‌లోనే ప్రశ్నాపత్రం జారీ చేస్తున్నారు. ఈ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో సత్ఫలితాలు ఇస్తుంది. పరీక్ష జరిగిన రోజున అవే గదుల్లో సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసి, విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


అంతా ఆన్‌లైన్‌ల్లోనే..

ఇంటర్‌బోర్డు ఆదేశాల మేరకు ప్రయోగశాలల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రయోగ పరీక్ష మూల్యాంకనం, మార్కుల నమూ నా దీని ద్వారా పర్యవేక్షిస్తారు. ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్‌ పర్యవేక్షణలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారానే ప్రశ్నపత్రం అందుతుంది. ప్రశ్నలు ఇవ్వగానే అవసరమైన పరికరాలు , రసాయనాలతో ప్రయోగం చేయాలి. వచ్చిన ఫలితం ఆధారంగా సమాధాన పత్రంలో నిర్ణీత సమయంలో రాయాల్సి ఉంటుం ది. పరీక్షలు పూర్తికాగానే ఎగ్జామినర్‌ మూల్యాంకనం చేసి ,వేసిన మార్కులను అదే రోజు వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు.


అఫిలియేషన్‌ ఉన్న కళాశాలల్లోనే..

2018-19 సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్‌ నుంచి అఫిలియేషన్‌ పొందిన కళాశాలలు, ల్యాబ్‌ లో సీసీ కెమెరా, 50 మంది కంటే ఎక్కువ మంది బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు కళాశాలల్లో ఉంటేనే పరీక్ష కేంద్రాగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో బైపీ సీ 1119 మంది, ఎంపీసీ 807 మంది మంది పరీక్షలు రాయనున్నారు. ఒకేషనల్‌ కోర్సులో ప్రథమ సంవత్సరంలో 807 , ద్వితీయ సంవత్సరంలో 630 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. ఇందుకోసం 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి పరీక్షలు ..

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రాలను చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. 


logo