బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 31, 2020 , 00:14:54

ఉరి సరైందే..

ఉరి సరైందే..
  • సమత కేసు దోషులకు మరణ శిక్షపై సర్వత్రా హర్షం
  • పోలీసు అధికారుల పనితీరును అభినందించిన ఎస్పీ మల్లారెడ్డి
  • ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ అభిప్రాయం
  • జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌,ఖానాపూర్‌ మండలాల ప్రజల ఆనందం

జైనూర్‌ : సమత కేసులో ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఏ1 షేక్‌బాబు (30), ఏ2 షేక్‌ షాబొద్దీన్‌ (40), ఏ3 షేక్‌ ముఖ్దుం(30)ను దోషులకు తేల్చుతూ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణ శిక్ష విధించింది. బతుకు దెరువుకోసం వచ్చిన వివాహితపై హత్యాచారం చేసిన మానవ మృగాలకు 66 రోజుల్లోనే ఉరి శిక్ష విధించడంపై లింగాపూర్‌, సిర్పుర్‌(యు), జైనూర్‌, ఖానాపూర్‌ (నిర్మల్‌) మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లపూర్‌ గ్రామానికి చెందిన టేకు గోపి బతుకుదెరువు కోసం తన భార్యా పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం జైనూర్‌ మండల కేంద్రానికి వచ్చాడు. భార్య భర్తలిద్దరూ ఊరూరా తిరుగుతూ వెంట్రుకలకు చిన్న చిన్న వస్తువులు అమ్ముకొనేవారు.


ఈ క్రమంలో ఎప్పటిలాగే 24.11.2019న  ఉదయం 6.30 గంటలకు గోపి తన భార్య సమతను ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో ఎల్లాపటార్‌లో వస్తువులు అమ్ముకొన్న సమత.. పక్కనే ఉన్న రామునాయక్‌ తండాకు వెళ్తున్న సమయంలో షేక్‌బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్దుం పత్తి చేనులోకి లాక్కెళ్లి సామూహికంగా లైంగిక దాడి చేశారు. ఆపై కత్తితో గొంతుకోస అత్యంత కిరాతకంగా హత్యచేశారు. అదేరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో టేకు గోపి తన భార్య కనబడడం లేదని లింగాపూర్‌ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మరుసటి రోజు 25న ఉదయం 9 గంటల ప్రాంతంలో పొలీసులకు సమత మృతదేహం లభ్యమైంది. 


పోలీసులు విచారణ చేపట్టి అదే నెల 27న ముగ్గురు నిందితులను అదుపులో తీసుకొని మెడికల్‌ పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ ఘటనపై లింగాపూర్‌, సిర్పూర్‌(యు), జైనూర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డిసెంబర్‌ 11న ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా 44 మంది సాక్షులను చార్జిషీటులో పొందుపరిచారు. అన్ని ఆధారాలు సేకరించి డిసెంబర్‌ 14న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 44 మంది సాక్షుల్లో 25 మందిని కోర్టు ముందు పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ ప్రవేశ పెట్టారు. డిసెంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 31 వరకు సాక్షుల విచారణ జరిగింది. తాము నేరం చేయలేదని, తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు ముందు చెప్పగా, నిందితులకు రెండు సార్లు అవకాశం కల్పించింది.


కానీ.. నిందితులు సరైన సాక్ష్యాలు ప్రవేశ పెట్టలేకపోగా 31.12.2019న కోర్టులో విచారణ పూర్తయింది. ఇరువురి వాదనాలు విన్న కోర్టు.. నిందితులపై నేరం రుజువైనందున 30.01.2020 గురువారం రోజున మరణ శిక్ష, 26000 జరిమానా విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసు నిందితులకు మరణ శిక్ష విధించడంపై లింగాపూర్‌, సిర్పుర్‌(యు), జైనూర్‌ మండలాలతో పాటు అటు సమత సొంత మండలమైన ఖానాపూర్‌లోనూ ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అతి తక్కువ కాలంలోనే నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన డీఎస్పీ సత్యనారాణ, సీఐ జవ్వాజి సురేశ్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌ను ఎస్పీ మల్లారెడ్డి అభినందించారు.


logo
>>>>>>