గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 , 23:44:25

బల్దియాలో నవశకం

బల్దియాలో నవశకం

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కొలువుదీరిన పాలకవర్గం

కాగజ్‌నగర్‌టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు జడ్పీ సీఈవో, ప్రత్యేకాధికారి వేణు అధ్యక్షతన చైర్మన్‌గా సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌గా గిరీష్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు. 30 మంది కౌన్సిలర్లతో జడ్పీ సీఈవో వేణు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా 7వ వార్డు కౌన్సిలర్‌ ఎల్లేశ్‌ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేపట్టారు. జడ్పీ సీఈవో వేణు చైర్మన్‌గా సద్దాం హుస్సేన్‌ పేరును తెలుపగా.. 27వ వార్డు కౌన్సిలర్‌ పంబాల సుజాత ప్రతిపాదించారు. 23వ వార్డు కౌన్సిలర్‌ బొద్దున విద్యావతి చేతులెత్తి బలపరిచారు. వైస్‌ చైర్మన్‌గా రాచకొండ గిరీష్‌కుమార్‌ పేరును తెలుపగా.. 15వ వార్డు కౌన్సిలర్‌ స్వామిశెట్టి రాజేందర్‌ ప్రతిపాదించారు. 17వ వార్డు కౌన్సిలర్‌ విజయ్‌ కుమార్‌ యాదవ్‌ బలపరిచారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు పోటీ లేకపోవడంతో వీరిద్దరిని ప్రత్యేక అధికారి ఏకగ్రీవంగా ప్రకటించారు.


కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం : సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టాం కట్టారనీ, మన మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుకుందామని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా అభివృద్ధి సంక్షేమం కోసం పాటు పడుతున్నారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. 


పటిష్ట బందోబస్తు

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు కాగజ్‌నగర్‌ డీఎస్పీ వైవీఎస్‌ స్వామి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇతరులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రమాణ స్వీకరానికి వెళ్లే ద్వారం వద్ద బాంబ్‌ స్వాడ్‌, మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.


విజయోత్సవ ర్యాలీ ..

మున్సిపల్‌ ఎన్నికల్లో 22 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కోనేరు వంశీ, పలువురు నాయకులు పెట్రోల్‌ పంప్‌ ఏరియా నుంచి ర్యాలీగా రాజీవ్‌ గాంధీచౌరస్తా, అంబేద్కర్‌ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తా మీదుగా ర్యాలీ సాగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉత్సాహంగా డప్పు చప్పుళ్లు నడుమ నృత్యాలు చేశారు. పటాకలు కాల్చారు. మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్‌, జై కేటీఆర్‌ నినాదాలతో పట్టణంలోని వీధులన్నీ మారుమోగాయి. అంతకు ముందు పొట్టి శ్రీరాములు,అంబేద్కర్‌ విగ్రహానికి చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ రాచకొండ గిరీష్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


logo