శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 26, 2020 , 00:35:19

గులాబీ విజయబావుటా..

 గులాబీ విజయబావుటా..
  • -ఏకపక్ష తీర్పునిచ్చిన పట్టణ ప్రజలు
  • -30 వార్డుల్లో 22 స్థానాల్లో గులాబీ గెలుపు
  • -6 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌
  • -రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు
  • -పత్తాలేని బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, సీపీఐ
  • -విజయ సారథి సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
  • -అంబరాన్నంటిన టీఆర్‌ఎస్‌ సంబురాలు

మున్సి‘పోల్స్‌'లో టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరేసింది. కాగజ్‌నగర్‌లోని ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా, మధ్యాహ్నం 12 .30 గంటలకు పూర్తి చేసి.. 1.30 గంటలకు ఫలితాలు వెల్లడించారు. పట్టణంలోని 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, ప్రజానీకం ఏకపక్ష తీర్పునిచ్చింది. 22 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్‌ పార్టీ 6 స్థానాలకే పరిమితమైంది. రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందగా, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, సీపీఐ పార్టీలు పత్తాలేకుండా పోయాయి. సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చి.. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ఉన్న నమ్మకంతో ఓటర్లు కారు గుర్తుకు జై కొట్టారు. ఇక బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్వయంగా రంగంలో దిగి ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అత్యధిక స్థానాల్లో ‘కారు’ దూసుకెళ్లగా, శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
- కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌టౌన్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కాగజ్‌నగర్‌ టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. పట్టణ ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 22 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలవడంతో, చైర్మన్‌ ఎన్నికకు సంపూర్ణ మెజార్టీని సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు ఖాతా కూడా తెరవలేదు.

ఫలితాలు వెల్లడించిన అధికారులు..

ఈనెల 22న నిర్వహించిన కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును కాగజ్‌నగర్‌లోని డిగ్రీ కళాశాలలో అధికారులు శనివారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 12 గంటల వరకు సాగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు అధికారికంగా ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 22 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, 6 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ, మరో రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందినట్లు ప్రకటించారు.

ఏకపక్ష తీర్పునిచ్చిన ఓటర్లు..

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఏకపక్ష తీర్పునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 22 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించి చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన పూర్తి మెజార్టీని అందించారు. మున్సిపాలిటీ పరిధిలోని 29 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతోపాటు, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై పూర్తి నమ్మకం ఉన్న పట్టణ ఓటర్లు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపు పూర్తిస్థాయిలో మొగ్గుచూపారు. ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఎన్ని విధాలుగా మభ్యపెట్టినప్పటికీ అభివృద్ధిని కోరుకున్న కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఓటర్లు టీఆర్‌ఎస్‌కే విజయాన్ని అందించారు. పార్టీ విజయంతో శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పటాకలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.

ఆరింటా కాంగ్రెస్‌..

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 29 చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ, కేవలం 6 ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 4, 5, 12, 18, 19, 29 వార్డులలో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై కాంగ్రెస్‌ అభ్యర్థులు చేసిన అసత్య ప్రచారాలను కాగజ్‌నగర్‌ పట్టణ ప్రజలు తిప్పికొట్టారు.

ఖాతా తెరువని బీజేపీ, ఎంఐఎం, సీపీఎం

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం, సీపీఎం తమ ఖాతా తెరవలేదు. మున్సిపాలిటీ పరిధిలోని ఒక స్థానంలో కూడా ఆ పార్టీల అభ్యర్థులు గెలుపొందలేదు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో 30 స్థానాల్లో బీజేపీ పోటీలో నిలిచినప్పటికీ, ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. బీజేపీ ఎంపీ సోయం బాపురావు రంగంలో దిగి ప్రచారం చేసినప్పటికీ, కాగజ్‌నగర్‌ పట్టణ ప్రజలు బీజేపీ హామీలను, టీఆర్‌ఎస్‌పై చేసిన విమర్శలను పట్టించుకోలేదు. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ(ఎం), టీడీపీల అడ్రస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తిగా గల్లంతైంది.

ప్రశాంతంగా లెక్కింపు...

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగింది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన అధికారులు ఆ తరువాత బ్యాలెట్‌ బాక్సులోని ఓట్లను లెక్కించారు. మధ్యాహ్నం 12 .30 గంటలకు లెక్కింపు పూర్తి కాగా, 1.30 గంటలకు అధికారులు ఫలితాలను వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం (పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి) 31,235 ఓట్లు పోల్‌ కాగా, దీనిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 15, 629 ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 8172 ఓట్లు, బీజేపీకి 3008 ఓట్లు, ఎంఐఎంకు 453 ఓట్లు, సీపీఐ(ఎం)కు కేలం 57 ఓట్లు, టడీపీకి 184 ఓట్లు, స్వతంత్రులకు 3178 ఓట్లు, నోటాకు 141 ఓట్లు వచ్చాయి. 413 చెల్లని ఓట్లు పడ్డాయి.logo