మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 26, 2020 , 00:33:56

సరిలేరు కారుకెవ్వరు

సరిలేరు కారుకెవ్వరు
  • -ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు
  • -పెరుగుతున్న ప్రజల మద్దతు
  • -వరుస ఎన్నికల్లో జయకేతనం
  • -తాజాగా.. మున్సి‘పోల్స్‌'లోనూ హవా
  • -ఢీలా పడిన ప్రతిపక్షాలు


ఎన్నిక ఏదైనా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజలు పట్టంగడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్నారు. అసెంబ్లీ నుంచి పంచాయతీ, పరిషత్‌ దాకా జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అండగా నిలిచారు. తాజాగా మున్సిపోల్స్‌లోనూ జై కొట్టారు. మొత్తంగా ‘కారు’ స్పీడ్‌కు ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యాయి. ఉనికి కోసం ఆరాటపడ్డ కాంగ్రెస్‌, బీజేపీ మరోసారి బేజారయ్యాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కాగజ్‌నగర్‌ టౌన్‌: ఎన్నికలు ఏవైనా సరే జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి వరుస విజయాలతో జిల్లాలో కారు దూసుకుపోతోంది. పల్లె నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయభేరి మోగిస్తోంది. 2019లో వరుసగా జరిగిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ జిల్లాలో గులాబీ జెండా ఎగిరింది. .

ఎదరులేని శక్తిగా టీఆర్‌ఎస్‌...

జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎదురులేని శక్తిగా ఎదిగింది. దీనిని వరుసగా వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలే నిరూపిస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలు మరింత బలహీనంగా మారుతున్నాయి.  తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఆయోమయానికి గురిచేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 30 స్థానాల్లో పోటీచేసినప్పటికీ ఒక్క చోట కూడా ఆపార్టీ గెలుపొందలేదు. 30 వార్డులలో కేవలం మూడు వేల ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే సరాసరిగా ప్రతి వార్డుకు కేవలం 100 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. ఇక టీడీపీ, సీపీఐ(ఎం), ఎంఐఎం పార్టీలు టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో కూడా లేవు. ఆరు వార్డుల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని కాపాడుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో బలంగా నిలిచిపోయాయి.

సంక్షేమ పథకాలే అస్ర్తాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు పొందిన లబ్ధిదారులు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. దీనికి తోడు జిల్లాకే తలమానికంగా ఉన్న సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునః ప్రారంభం టీఆర్‌ఎస్‌ విజయానికి కీలకమైంది. ఎస్పీఎం ప్రారంభంతో ఉపాధి పొందుతున్న వందలాది మంది కార్మికుల కుటుంబాలతోపాటు, కాగజ్‌నగర్‌ పట్టణంలో పెరిగిన వాణిజ్య, వ్యాపారాలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుకూల పవనాలను కల్పించాయి.logo
>>>>>>