శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 23, 2020 , 23:45:15

బ్యాలెట్‌లో భవితవ్యం

బ్యాలెట్‌లో భవితవ్యంమున్సి‘పోల్స్‌' బుధవారం ముగియగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వార్డుల వారీగా పోలింగ్‌ శాతాన్ని బట్టి అంచనాలు వేసుకుంటూ ఫలితాలపై విశ్లేషించుకుం టున్నారు. ఇక కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగురేసి చైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, తమకు బలమున్న చోట్ల గెలిచితీరుతామని విపక్ష పార్టీలు భరోసాతో ఉన్నాయి. కాగా, ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేయనుండగా, 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు     ఓ ప్రకటనలో తెలిపారు.  
- కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌ రూరల్‌


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌ రూరల్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ బుధవారం ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో దాగి ఉంది. స్థానిక ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల భవనంలో బ్యాలెట్‌ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపర్చారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. వారం రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు.. బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి ఎవరి అంచనాల్లో వారు లెక్కలు వేసుకుంటున్నారు. 69.09 శాతం పోలింగ్‌ నమోదు కాగా, గత మున్సిపల్‌ ఎన్నికల్లో 74 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు గడువు ఉండడంతో అభ్యర్థులు తమ వార్డుల్లో పర్యటిస్తూ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. మెజార్టీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశముండగా, తమకు బలమున్న కొన్ని వార్డుల్లోనైనా గెలుపొందుతామనే ధీమాలో విపక్ష పార్టీలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అధికార పార్టీ 20 నుంచి 25 సీట్లను గెలుసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు 2,3 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 1,2 చోట్ల స్వతంత్య్ర, ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవీ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి చేరుకోవడం ఖాయమైనప్పటికీ తమకు కూడా ఒకటీ.. రెండు స్థానాల్లో ప్రాతినిధ్యం ఉంటుందని విపక్ష పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు మాత్రం కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగరవేసి 100 శాతం మెజార్టీతో చైర్మన్‌ పదవిని కైవసం చేసుకుంటామని భావిస్తున్నారు.
పోలింగ్‌ శాతాన్ని బట్టి అభ్యర్థుల అంచనాలు


మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని బట్టి అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సైతం తమతమ వార్డుల్లోని ఓటర్లతో చర్చిస్తూ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. మున్సిపాలిటీ పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు అత్యధికంగా పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 45,161 మంది ఓటర్లు ఉండగా, 31,202 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 22,450 మంది పురుష ఓటర్లు కాగా, వీరిలో 15, 401 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 68.60 పోలింగ్‌ శాతం నమోదైంది. 22,711 మహిళా ఓటర్లకు గాను 15,801 మంది ఓటు వేశారు. దీంతో 69.57 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తిని చూపించారు. ఆరో వార్డులో పోలింగ్‌ శాతం 81.46 నమోదు కావడం అధికార పార్టీకి లాభం చేకూర్చుతుందని, పోలింగ్‌ శాతం తక్కువ నమోదైన 29వ వార్డులో సైతం అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 30 వార్డుల్లో అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందనీ, ఒకటీ రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీలు ఇతరులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు వస్తున్నాయి.logo