శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 23, 2020 , 23:45:15

విద్యార్థులు .. సమాజ సేవకులు

విద్యార్థులు .. సమాజ సేవకులు

రెబ్బెన: విద్యార్థులు చదువుతో పాటు సేవానిరతిని చాటుతున్నారు. సమాజ హితమే తమ ధ్యేయం అంటూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో శ్రమదానం చేస్తున్నారు. రెబ్బెన ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) శిబిరం ద్వారా మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో వారం రోజుల పాటు శీతాకాల ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఎంతో ఉత్సాహంతో శ్రమదానంతో పాటు ప్రజల్లో నెలకొన్న అపోహలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గతంలో అంతగా ఆసక్తి చూపని విద్యార్థులు ప్రస్తుతం సామాజిక సేవపై మక్కువ పెంచుకుంటున్నారు. ప్రజలు మూఢ నమ్మకాలను వీడాలని ప్రచారం చేశారు. మరుగుదొడ్ల వాడకం, ఓటు ప్రాధాన్యత, అక్షరాస్యత, మహిళలకు చదువుపై ప్రాముఖ్యత, పిల్లల పోషకాహారం, బ్యాంకు వివరాలు అపరిచితులకు అందించకుండా జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్య పరిచారు. దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలనీలు, విధులు, పొలాలకు వెళ్లే దారులు శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు. గ్రామాల్లో సీజనల్‌, తరుచుగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించినట్లు వలంటీర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.
ఆనందంగా ఉంది
గంగాపూర్‌లో జరుగుతున్న శీతాకాల శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్య పరచడం మర్చిపోలేను. తన వంతుగా వివిధ అంశాలపై అవగాహన కల్పించాను. కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు అందించిన ప్రోత్సాహంతోనే ఆసక్తి కలిగి ఎన్‌ఎస్‌ఎస్‌లో పాల్గొన్నాను.    -టీ అంకిత, బీకాం, ప్రథమ సంవత్సరం, రెబ్బెనసేవ చేయడం మరిచిపోలేనుగ్రామాల్లో విధులు, వాడలు శుభ్రం చేస్తూ ప్రజలకు సేవ చేయడం మరిచిపోలేను. ప్రతి ఒక్కరూ సమాజంలో సేవా దృక్పథం కలిగి ఉండాలి. గ్రామాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తో క్రమశిక్షణతో పాటు గ్రామంలోని పరిస్థితులు తెలుస్తాయి.
                          -డొంగ్రి సంతోశ్‌, బీజడ్‌సీ,
                          తృతీయ సంవత్సరం, రెబ్బెన

ప్రజలకు అవగాహన కల్పించాంజాతీయ సేవా పథకం శిబిరంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. వయోజన విద్య, పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, హరితహారం, మరుగుదొడ్ల వినియోగం, ఇంకుడుగుంతలు లాంటి వాటితో పాటు ప్రభుత్వ పథకాలు వివరించాం. గ్రామంలో ఎవరూ కూడా మూఢ నమ్మకాలు నమ్మవద్దని అవగాహన కల్పించాం.
                        -వీ హరీశ్‌, బీకాం, ప్రథమ సంవత్సరం, రెబ్బెన


కొత్త విషయాలు తెలుస్తాయి
జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా గ్రామాల్లో అందరితో పరిచయాలు ఏర్పడుతాయి. పేదలు పడుతున్న ఇబ్బందులు, వారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో భవిష్యత్‌కు మంచిగా ఉపయోగపడుతుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు భవిష్యత్‌లో ఆర్మీ, కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ఉపయోగ పడుతుంది.            -ఎంఏ జాకీర్‌ ఉస్మాని, ప్రిన్సిపాల్‌,
         రెబ్బెన ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలlogo