శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 22, 2020 , 23:42:32

మున్సిపోల్స్‌ ప్రశాంతం

మున్సిపోల్స్‌ ప్రశాంతం
  • - 69.09 శాతం నమోదు ఆరో వార్డులో అత్యధికం
  • -పురుషులకంటే మహిళలదే పైచేయి
  • - వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ సరళి పరిశీలన
  • -అడుగడుగునా పోలీసుల భారీ బందోబస్తు
  • - పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి
  • - స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరిన బ్యాలెట్‌ బాక్సులు
  • - ఈ నెల 25నతేలనున్న అభ్యర్థుల భవితవ్యం

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బల్దియా పరిధిలోని 30 వార్డుల్లో 45,161 మంది ఓటర్లు ఉండగా, 31,202 మంది ఓటేశారు. మొత్తంగా 69.09 శాతం నమోదు కాగా, అత్యధికంగా ఆరో వార్డులో 81.21 శాతం, అత్యల్పంగా 29వ వార్డులో 56.67 శాతంగా నమోదైంది. ఇక పురుషులకంటే మహిళలే ఓటింగ్‌లో చైతన్యం ప్రదర్శించారు. సాయంత్రం 5.30 గంటల వరకు ప్రక్రియ కొనసాగగా, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి.. సిబ్బందికి సూచనలు చేశారు.

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌టౌన్‌


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌టౌన్‌ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో బుధవారం పుర పోరు ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 45,161 మంది ఓటర్లకు గాను 31,202 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 69.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరగా, పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా తరలివచ్చారు.


ఆరోవార్డులో అత్యధిక ఓటింగ్‌..

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో 45,161 మంది ఓటర్లు ఉండగా, 31,202 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 22,450 మంది పురుష ఓటర్లు కాగా, వీరిలో 15, 401 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 68.60 పోలింగ్‌ శాతం నమోదైంది. 22,711 మహిళా ఓటర్లకు గాను 15,801 మంది ఓటు వేశారు. దీంతో 69.57 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తిని చూపించారు. మున్సిపాలిటీలోని ఆరో వార్డులో అత్యధికంగా 81.21 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ వార్డులో 1559 ఓటర్లకు గాను 1266 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29వ వార్డులో అతి తక్కువగా 56.67శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ వార్డులో 1581 ఓటర్లకు గాను 896 మంది మాత్రమే ఓటు వేశారు.


పకడ్బందీ ఏర్పాట్లు..

ఉదయం 7 గంటల నుంచే వారు కేంద్రాలకు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి, ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు 11.35 శాతం, 11 గంటల వరకు 29.13 శాతం, ఒంటి గంట వరకు 47.24 శాతం, 3 గంటలకు 60.62 శాతం, 5 గంటలకు 69.09 శాతంగా నమోదైంది.


ఓటేసిన ప్రముఖులు..

మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులోని మండల పరిషత్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే కోనప్ప దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్డు నంబర్‌ 29లోని బాలవిద్యామందిర్‌లో జేసీ రాంబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


స్ట్రాంగ్‌ రూమ్‌కు బ్యాలెట్‌ బాక్సులు..

కాగజ్‌నగర్‌ టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 63 పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ బాక్సులను స్థానిక ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఎన్నికల అధికారులు సామగ్రితో అక్కడికి చేరుకొని, బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. జేసీ రాంబాబు, డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, డీపీఆర్వో తిరుమల తదితరులున్నారు.


logo