బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 22, 2020 , 00:20:03

చెన్నూర్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అర్చన గిల్డా

చెన్నూర్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి  అర్చన గిల్డా
  • - వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌
  • - ప్రకటించిన విప్‌ బాల్క సుమన్‌

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : చెన్నూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈమేరకు మంగళ వారం చెన్నూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అధికారికంగా ప్రకటించారు. మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన అర్చన్‌ గిల్డాను, వైస్‌ చైర్మన్‌ ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి ఎండీ నవాజొద్దీన్‌ పేర్లను ప్రకటించారు.

ఏడు వార్డులు ఏకగ్రీవం..

మున్సిపాలిటీలో 18వార్డులుండగా ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి తనుగుల సరోజన పోటీ నుంచి తప్పుకొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్న అర్చన గిల్డా 10వ వార్డు నుంచి, వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఎండీ నవాజోద్దీన్‌ 13వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్ల ప్రకటన అనంతరం చైర్మన్‌గా ప్రకటించబడిన అర్చన గిల్డా, వైస్‌ చైర్మన్‌గా ప్రకటించబడిన ఎండీ నవాజోద్దీన్‌కు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌లు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

నాడు తాత.. నేడు మనవరాలు

నాడు చెన్నూర్‌ మున్సిపాలిటీ తొలి చైర్మన్‌ పదవిని తాత చేపట్టగా నేడు మనవరాలు తొలి చైర్మన్‌ పదవి చేపట్టబోతున్నారు. 1962 నుంచి 1967వరకు చెన్నూర్‌ మున్సిపాలిటీగా కొనసాగింది. ఆ సమయంలో బేరం భగత్‌గిల్డా చైర్మన్‌గా ఉన్నారు. అయితే ఆ తర్వాత చెన్నూర్‌ మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీగా మారడంతో తొలి, చివరి మున్సిపల్‌ చైర్మన్‌గా బేరం భగత్‌ గిల్డా రికార్డుల్లో నిలిచారు. 2018 ఆగస్టులో చెన్నూర్‌ గ్రామ పంచాయతీ నుంచి మరోసారి మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తొలి చైర్మన్‌ అయ్యే అవకాశం అర్చన గిల్డాకు దక్కింది. నాడు చైర్మన్‌గా ఉన్న బేరం భగత్‌గిల్డాకు అర్చన గిల్డా మనవరాలు. ఇలా ఒకే కుటుంబానికి రెండోసారి చైర్మన్‌ పదవి చేపట్టే అవకాశం రావడం విశేషం.logo