మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 20, 2020 , 02:21:33

ఇంద్రవెల్లికి మెస్రం వంశీయులు

ఇంద్రవెల్లికి మెస్రం వంశీయులు
  • - ప్రధాన్‌గూడ, ఎస్టీగోండ్‌గూడలో బస
  • - చెట్టుపై భద్రంగా గంగాజలం ఝరి
  • - నేడు ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు
  • - 24న నాగోబాకు మహాపూజ

ఇంద్రవెల్లి : గంగాజలంతో మెస్రం వంశీయులు ఆదివారం ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ఈ నెల 14న గోదావరి నదికి పయనమై మండలానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రధాన్‌గూడ, ఎస్టీగోండ్‌గూడ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని హనుమాన్‌ ఆలయ ఆవరణలోని ఓ చెట్టుపై పవిత్ర గంగాజలం ఝరిపై తెల్లటి వస్త్రం కప్పి భద్రపర్చారు. ఆ తర్వాత మెస్రం వంశీయులతో పాటు గ్రామస్తుల ఆధ్వర్యంలో గంగాజలం ఉన్న ఝరికి ప్రత్యేక పూజలు చేశారు. మండలానికి చేరుకున్న మెస్రం వంశీయులు కుటుంబసమేతంగా అక్కడే బస చేయనున్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ఇంద్రాదేవికి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మెస్రం వంశీయులు తెలిపారు. ఇంద్రాదేవి ఆలయం నుంచి సాయంత్రం కెస్లాపూర్‌ మర్రిచెట్లకు బయలుదేరుతామని పేర్కొన్నారు. మర్రిచెట్ల నీడలో మూడు రోజులు కుటుంబ సమేతంగా బస చేసి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు. 24న నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో కటోడ హనుమంత్‌రావ్‌, కోసుకటోడ, తుకుడోజీ, తిరుపతి, గణపతి, దాదారావ్‌ పాల్గొన్నారు.

 చురుగ్గా జాతర ఏర్పాట్లు

కెస్లాపూర్‌ నాగోబా జాతర కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆలయ ఆవరణలోని మర్రిచెట్ల ప్రాంతాన్ని చదును చేశారు. దర్బార్‌హాల్‌లో సీసీ పనులు పూర్తికావచ్చాయి. తైబజార్‌లో దుకాణాల కోసం టెండర్‌ నిర్వాహకులు ప్లాట్లను ఏర్పాటుచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు పిచ్చిమొక్కలను తొలగిస్తుండగా, ముత్నూర్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా బ్లేడ్‌ ట్రాక్టర్‌తో చదును చేస్తున్నారు. అలాగే రంగులరాట్నాలు చేరుకుంటున్నాయి. ఏర్పాట్లను గిర్ధావర్‌ మెస్రం లక్ష్మణ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.logo
>>>>>>