శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 18, 2020 , 01:17:41

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు
  • -రేపటి నుంచి ‘పల్స్‌ పోలియో’
  • -మూడు రోజుల పాటు కార్యక్రమం
  • -జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి
  • -546 కేంద్రాలు.. 2184 మందికి విధులు
  • -54642 మంది చిన్నారులకు మందు
  • -విజయవంతం చేయాలి : డీఎంహెచ్‌వో కుమ్రం బాలు


జిల్లాలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 546 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2184 మంది సిబ్బందికి విధులు అప్పగించారు. 54642 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే అన్ని కేంద్రాలకు సరిపడా బాక్సులను పంపించారు. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పక చుక్కల మందు వేయించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు పిలుపునిచ్చారు.
- ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

ఆసిఫాబాద్‌,నమసే తెలంగాణ: జిల్లాలో ఈ నెల 19న నిర్వహించే మొదటి విడుత పల్స్‌పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసి, ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు వైరస్‌ వ్యాపించకుండా రాష్ట్రంతో పాటు జిల్లాలో అధికార యంత్రాంగం ఎంతో కృషి చేపట్టింది. పోలియో రహిత సమాజం కోసం ఏటా రెండు విడుతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. దీనిని జాతీయ కార్యక్రమంగా చేపడుతున్నారు.

పోలియో వ్యాధి లక్షణాలు

మైలాటిక్స్‌ వైరస్‌ సీ1, సీ2, సీ3 ద్వారా పోలియో వ్యాపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీ2 వైరస్‌ను మన దేశంలో సమూలంగా నిర్మూలించా రు.  కలుషితమైన నీరు, ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్రధానంగా 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురైతే జ్వరం, నీరసం, కండరాల బలహీనత, కాళ్లు, చేతులు చచ్చుబడిపోతాయి. చచ్చుబడిన అవయవాలకు స్పర్శ ఉండదు. మానవ శరీర నాడీ వ్వవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రభుత్వాల కృషితో తగ్గిన కేసులు

పోలియో నివారణకు భారత ప్రభుత్వ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుంది. మన దేశంలో 1995లో పోలీయో చుక్కలు వేయడం ప్రారంభించారు. దీనిని ప్రతి ఏడాది రెండు విడుతలుగా నిర్వహిస్తుండడంతో దేశంలో పోలియో తగ్గిపోయింది.

54,642 మంది పిల్లలకు పోలియో చుక్కలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 54,642 మంది 5 ఏండ్లలోపు పిల్లలను ఉన్నారు. ఇంతే కాకుండా సంచార జాతుల పిల్లలందరికి వైద్యాధికారులు పోలియో నివారణ చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలు ఉన్నాయి. 546 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసి 2184  మంది సిబ్బందిని కేటాయించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రద్దీ ప్రాంతాల్లో  పోలియో చుక్కలు వేసేందుకు 144 మంది ప్రత్యేక వైద్యసిబ్బంది ఏర్పాటు చేయనున్నారు. 74 మంది హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌ఓ, డీఐఈల పర్యవేక్షణలో ప్రతి చిన్నారికి  పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. హైరిస్క్‌ ఏరియాలో, సంచార జాతుల వారికి, ఇతరాత్ర స్థిర నివాసం లేని వారికి 22 మోబైల్‌ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. సంచార జాతుల పిల్లలకు మోబైల్‌ టీం ద్వారా భవన నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో నివాసముండే వారిని గుర్తించి ప్రత్యేకంగా పోలియో చుక్కలు వేయనున్నారు. 19న తప్పిన వారికి 20, 21వ తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి పొలియో చుక్కలు వేయనున్నారు.logo