బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 16, 2020 , 23:35:09

పోలింగ్‌కు భారీ బందోబస్తు

పోలింగ్‌కు భారీ బందోబస్తు
  • -పోలింగ్‌కు భారీ బందోబస్తు
  • -ప్రణాళికలు సిద్ధం చేసిన పోలీసులు
  • - సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
  • -చెక్‌పోస్టులతో వాహనాల రాకపోకలపై నిఘా

కుమ్రం  ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తుకు సిద్ధమైంది. ఎన్నికల ఏర్పాట్లలో రెవెన్యూ, ఇతర శాఖలు నిమగ్నమయ్యాయి. ఎన్నికలు జరిగే పోలింగ్‌ కేంద్రాలపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించడంతో పాటు బందోబస్తు ఏర్పాట్ల తీరును ఎస్పీ సమీక్షిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ, ఆయా వార్డుల్లో సుమారు 200 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధమవుతోంది. జిల్లా పోలీసులతోపాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ముందుగానే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ 63 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 8 ఉన్నాయ ని స్పష్టం చేశారు. ఇక సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 16, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 39 ఉన్నట్లు తేల్చారు. ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

200 మందితో బందోబస్తు..

మున్సిపాలిటీ ఎన్నికల కోసం జిల్లా నుంచి అన్ని విభాగాల పోలీసులను ఎంపిక చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 63 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 200 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎస్పీ మల్లారెడ్డితో పాటు ఏఎస్పీ సుధీంద్ర, కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి బందోబస్తును పర్యవేక్షిస్తారు. ముగ్గురు సీఐలు, ఎస్‌ఐలు 11 మంది, మిగితా సిబ్బంది 200 మందికి పైగా భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల సందర్భంగా మరికొంత మంది పోలీసు బలగాల అవసరం అయితే వారిని రప్పించేందుకు సిద్ధం అయ్యారు. జిల్లాకేంద్రంలో బలగాలను సిద్ధంగా ఉంచినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటికే రంగంలోకి పోలీసు శాఖ..

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే పర్యవేక్షించారు. ప్రస్తుతం ప్రచారం ముమ్మరమైన నేపథ్యంలో ప్రచారణ సరళి, ఇతర ఆంశాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ ఎన్నికలు కావడంతో మావోయిస్టుల ప్రభావం పెద్దగా ఉండదని పోలీసులు భావిస్తున్నారు. అదే సమయంలో వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ కిందిస్థా యి సిబ్బందికి సూచనలు అందిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మద్యం, గుడుంబా కేసులను పట్టుకుని నిందితులను తరలిస్తున్నారు. అదే సమయంలో పాత నేరస్తులను బైండోవర్‌ చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. ఎన్నికల తేదీ నాటికి అవసరమైతే ప్రత్యేక బలగాలను దింపాలని భావిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ మల్లారెడ్డి పలు సందర్భాల్లో కోరారు.logo