e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home కొమరంభీం శరవేగంగా ఎంవీకే ఓసీ పనులు

శరవేగంగా ఎంవీకే ఓసీ పనులు

అటవీ, రెవెన్యూ, సింగరేణి ఉమ్మడి సర్వేలు
రికార్డులను తనిఖీ చేస్తున్న ఉన్నతాధికారులు
వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలు

తాండూర్‌, అక్టోబర్‌ 16 : బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓపెన్‌కాస్టు ప్రారంభించేందుకు అధికారులు పనులు వేగంగా చేస్తున్నారు. అటు అటవీ, రెవెన్యూ, సింగరేణి అధికారుల ఉమ్మడి సర్వేలతో పాటు ఇటు రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. ముంపు గ్రామాలు ఎన్ని..? ఏ విధంగా భూములు కోల్పోనున్నారు..? నష్టపరిహారం అంచనా.. ఇలా అన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందించుకొని అనుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నారు. సీఎండీ స్థాయిలో నిత్యం ఉన్నతస్థాయి అధికారులు ఈ ఓపెన్‌కాస్టుల ప్రారంభంపై సమాలోచనలు చేస్తున్నారు. గోలేటి ఓపెన్‌కాస్టుకు సంబంధించి అటవీ అనుమతులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ ఎంవీకే పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.

జోరుగా సాగుతున్న సర్వే..
రెండు నెలలుగా ఇక్కడ అధికారులు జోరుగా సర్వే నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వే కొనసాగుతుండడం గమనార్హం. డ్రోన్లు, డీ జీపీఎస్‌ పరికరాలతో పాటు యాంటీనా శాటిలైట్లను ఉపయోగించుకొని అధికారులు బృందాలుగా మారి ఈ సర్వే చేస్తున్నారు. త్రీ ఇైంక్లెన్‌, మాదారం టౌన్‌షిప్‌తో సహా అటవీ ప్రాంతాల్లో ఈ సర్వే కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రాథమిక అంచనా పూర్తి చేసిన అధికారులు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్లు సైతం వచ్చి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినా వారి పర్యటన బయటపెట్టకుండా రహస్యంగా పనులు చేస్తున్నారు. రెవెన్యూ భూములు ఎంత..? అటవీ భూములు ఎంత..? ఎవరికి ఎంత నష్టపరిహారం అందించాలి..? ఇలా అన్ని రకాలుగా ఈ సర్వేలో పొందుపరుస్తున్నారు.

- Advertisement -

ఆరు ముంపు గ్రామాల గుర్తింపు..?
ఈ ఓపెన్‌కాస్టు పరిధిలో దాదాపు ఆరు ముంపు గ్రామాలుండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంవీకే 5 ఇైంక్లెన్‌, కొత్తగూడెం, ఎంవీకే 3 ఇైంక్లెన్‌, మాదారంటౌన్‌షిప్‌, వడ్డెరకాలనీతో పాటు నీలాయపల్లి సైతం ముంపు గ్రామాలు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీలే కావడంతోపాటు మాదారం టౌన్‌షిప్‌ పూర్తిగా సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. దీంతో ఈ పరిధిలో ఉండే గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు తక్కువగానే ఉండే అవకాశం ఉందని సింగరేణి అధికారులు భావిస్తున్నారు. ఎంవీకే 5 ఇైంక్లెన్‌, కొత్తగూడెం, ఎంవీకే 3 ఇైంక్లెన్‌ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో మొదటగా మాదారం టౌన్‌షిప్‌ ప్రాంతాన్ని పరిశీలనకు తీసుకొని తర్వాత మిగతా ప్రాంతాల్లో ఓపెన్‌కాస్టు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నెల రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ..
ఓ వైపు పనులు చేపడుతున్న అధికారులు అదే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణకు సైతం సిద్ధం అవుతున్నారు. నెల రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి నష్టపరిహారం ఎంత అనేది నిర్ణయం తీసుకుంటారు. ఏయే గ్రామాలకు ఎంత నష్టపరిహారం చెల్లించాలి..? పట్టాలున్న భూములు ఎన్ని…? అసైన్డ్‌ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఇలా అన్ని రకాలుగా సమాలోచనలు చేస్తున్నారు. అదే సమయంలో అప్పటి వరకు ఓపెన్‌కాస్టుకు సంబంధించి సరిహద్దులు నిర్ణయించేలా చర్యలు చేపడుతున్నారు. ఇలా ఓపెన్‌కాస్టుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్న అధికారులు.. వచ్చే మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఓపెన్‌కాస్టుకు సంబంధించి పురోగతిని సీఎండీ శ్రీధర్‌కు అధికారులు నిత్యం వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆలస్యం కావొద్దని ఆయన ఆదేశాల మేరకు పనులు వేగంగా చేస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement