e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home కొమరంభీం కట్టడితో.. సత్ఫలితం

కట్టడితో.. సత్ఫలితం

కట్టడితో.. సత్ఫలితం

రోడ్లన్నీ నిర్మానుష్యం
సరిహద్దులు కట్టుదిట్టం..
10 గంటల్లోపే నిత్యావసర సరుకుల కొనుగోలు
ఆ తర్వాత రోడ్డెక్కని బస్సులు

మంచిర్యాల, మే 12 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి రెండో దశను కట్టడిచేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాన్నిచ్చింది. నిత్యం రద్దీతో కళకళలాడే బస్టాండ్‌ 10 గంటల తర్వాత బోసి పోయింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూకు సడలింపు ఇవ్వడంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు బయటకు వచ్చారు. ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కూరగాయల మార్కెట్‌, దుకాణ సముదాయాలు ప్రజలు లేక వెలవెలబోయాయి. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వ్యాపార, వాణిజ్య కేంద్రమైన మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రజలతో నిత్యం రద్దీగా ఉండేది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వ్యాపారం నిమిత్తం ప్రజలు రోజూ చెన్నూర్‌, మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చేవారు. ఇటీవల మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవడం, వైద్య సేవల కోసం మంచిర్యాలకు తరలిరావడంతో జిల్లాలోనూ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం రాపనపల్లి- సిరొంచ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.

మహారాష్ట్ర నుంచి చెన్నూర్‌, మంచిర్యాల ప్రాంతాలకు ప్రజలు ఇటీవల వివిధ పనులు, వైద్యం కోసం వస్తుండడంతో జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ ప్రకటించుకున్నాయి. తమ గ్రామాలకు ఇతరులు రాకుండా ఆంక్షలు విధించుకున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్‌ పట్టణంలో బుధవారం రోడ్లన్నీ బోసి పోయి కనిపించాయి. బస్సుల రాకపోకలు కూడా నాలుగు గంటల లోపే ముగించేలా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉండడంతో బస్టాండ్‌ వెలవెలబోయింది. నిత్యం వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు ఆస్నాద, బీరెల్లి, తదితర చుట్టు పక్కల గ్రామాలకు బస్సులు వెళ్తుండడంతో రద్దీగా ఉండేది. అత్యవసర సేవలకు మాత్రం సడలింపు ఇవ్వడంతో మందుల దుకాణాలు తెరుచుకున్నాయి. జిల్లాకేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, చెన్నూర్‌ బ్రిడ్జి ప్రాంతాలు సైతం మధ్యాహ్నం 2 గంటల తర్వాత బోసిపోయి కనిపించాయి. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంచిర్యాలలో పరిస్థితిని సమీక్షించారు. విధులకు వెళ్లే ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
జిల్లాకు సుదూరంలో ఉన్న జన్నారంలోనూ కర్ఫ్యూ ప్రభావం కనిపించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నిత్యావసర సరుకుల కోసం దుకాణాలు తెరుచుకున్నాయి. అనంతరం రోడ్డుపై ఎవరు కనిపించినా వారి గుర్తింపు కార్డులను పోలీసులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాలకు వెళ్లే జన్నారంలో కర్ఫ్యూ ప్రశాంతంగా ఉంది. కలమడుగు నుంచి జగిత్యాలకు వెళ్లే దారిలో చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి ఎస్‌ఐ మధుసూదన్‌ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్‌, జన్నారం ప్రాంతాల్లో 10 గంటల తర్వాత పోలీసులు గస్తీలు తిరుగుతూ లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కట్టడితో.. సత్ఫలితం

ట్రెండింగ్‌

Advertisement