సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 23:54:11

పాపం ప్రతాక్షాలు

పాపం ప్రతాక్షాలు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా మారింది. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీలు కేవలం పోటీకి అభ్యర్థులను నిలపడం మినహా ఎక్కడా కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకటి, రెండు చోట్ల పోటీ ఇచ్చే పరిస్థితి ఉన్నా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఆయా పార్టీల నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో రెబెల్‌ అభ్యర్థులను తమ పార్టీల్లోకి తీసుకుని వారిని గెలిపించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల నుంచి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని, నామమాత్ర పోటీనే అని స్వయంగా ఆ పార్టీలకే చెందిన నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. జాతీయ పార్టీలకు కొన్ని వార్డులలో అభ్యర్థులు కూడా లేరంటే పరిస్థితి ఎంత దయనీంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనని పలువురు ఓటర్లే స్వయంగా వెల్లడిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్‌ వైపే తాము కూడా ఉంటామని ప్రజలు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.


పలు వార్డుల్లో అభ్యర్థులే కరువు

చెన్నూరులో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులే లేకుండా పోయారు. ఆ మున్సిపాలిటీలో 18 వార్డులు ఉంటే కాంగ్రెస్‌ పార్టీ నుంచి కేవలం 10 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈ పది మందిలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 13వ వార్డు అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడు. ఇక బీజేపీ పరిస్థితి కూడా ఇక్కడ అలాగే ఉంది. 18 వార్డుల్లో వారు నామినేషన్లు వేసినా అధికారుల పరిశీలనలో ఒక నామినేషన్‌ తిరస్కరించారు. ఇక మూడు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించకున్నారు. ఇక నస్పూరులో నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆయా పార్టీలకు దిశానిర్దేశం చేసే సరైన నాయకుడు లేడు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం అస్సలు లేదు. ఇక బీజేపీ పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభావం చూపిన సీపీఐ పార్టీ నుంచి కేవలం 15 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. లక్షెట్టిపేటలో కాంగ్రెస్‌, బీజేపీ కేడర్‌ మొత్తం టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌ ముఖ్య అనుచరులు కొత్త వెంకటేశ్వర్లు, వెంకటస్వామి గౌడ్‌, కమలాకర్‌ గౌడ్‌, నూనె ప్రవీణ్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడ ఆ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనమైంది. ఇక బీజేపీ పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక బెల్లంపల్లిలో కూడా ప్రతిపక్షాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదు. దీంతో కేవలం కార్యకర్తలు మాత్రమే పోటీలో నిలబడుతున్నారు. ఇక మంచిర్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌లో రెబెల్స్‌పైనే ప్రతిపక్ష నేతలు ఆశలు పెట్టుకున్నారు. అక్కడ నుంచి వచ్చే వారిని తమ వైపు తిప్పుకుని  టిక్కెట్‌ ఇచ్చి గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. 


నాయకత్వలేమితో అతలాకుతలం

ఓ వైపు అధికార పార్టీ పక్కా ప్రణాళికలు, వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎట్ట పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాటిల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దానికి జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను బాధ్యులను చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని హెచ్చరించారు. మరోవైపు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వీటన్నింటిని సమన్వయం చేయనున్నారు. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి మూల విజయారెడ్డి, అరిగెల నాగేశ్వర్‌రావును ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు కూడా అభ్యర్థులకు గెలుపు వ్యూహరచనలో పాలుపంచుకోనున్నారు. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ఇంకా నేతలు మున్సిపాలిటీల్లో పార్టీ జయకేతనం ఎగురవేసేందుకు తీవ్రంగా కృషి చేయనున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కేవలం మంచిర్యాల నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక పరిశీలకులను నియమించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి కేవలం మంచిర్యాల పట్టణం వరకే రాజకీయాలకు పరిమితం అయ్యారు. యువ నాయకుడు ఎరవెల్లి రఘునాథరావు ఉన్నప్పటికీ ఆయన కూడా మంచిర్యాల వరకే రాజకీయాలు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. దీంతో ఆ పార్టీలకు సరైన దిశానిర్దేశం చేసే నాయకుడే లేకుండా పోయారు. దీంతో గెలుపు సంగతి పక్కన పెడితే గట్టి పోటీ ఇస్తే చాలు అన్న చందంగా తయారయ్యింది ఈ రెండు పార్టీల పరిస్థితి.


అడ్రస్‌ లేని తెలుగుదేశం, సీపీఐ

ఇక గతంలో ఇక్కడ ఎంతో ప్రభావితం చేసిన తెలుగుదేశం, సీపీఐ పార్టీలను ప్రజలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత చెబితే అంత. ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా భారీ మెజారిటీతో గెలిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ చేసిన ద్రోహంతో కనీసం దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇక్కడ కనుమరుగు అయ్యింది. ఆ పార్టీ నుంచి కనీసం నామినేషన్‌ వేసే అభ్యర్థులు కూడా కరువయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక సీపీఐ పరిస్థితి కూడా అలాగే ఉంది. సీపీఐ శాసనసభా పక్ష నేతగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ఎన్నోమార్లు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ కార్మిక క్షేత్రంలో తనదైన ముద్ర వేసింది. అయితే కార్మికుల సమస్యల పట్టించుకోకుండా ఆ యూనియన్‌ నేతలు వ్యవహరించడంతో ప్రజలు, కార్మికులకు వారు పూర్తి స్థాయిలో దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ రెండు పార్టీల పరిస్థితి కూడా ఐసీయూలో ఉన్నట్టుగా ఉంది. కొన్ని చోట్ల ప్రతిపక్షాల కంటే స్వతంత్రులే ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేవలం నామ మాత్రమేనని పలువురు చెబుతున్నారు.logo