గురువారం 09 జూలై 2020
Khammam - Jun 23, 2020 , 00:13:56

పెట్టుబడి సాయం .. సాగుకు ఊతం

పెట్టుబడి సాయం .. సాగుకు ఊతం

 నైరుతి పలకరించింది.. వానకాలం వచ్చేసింది.. పొలం పదునుకొచ్చింది.. సాగుకు వేళైంది.. తెలంగాణ సర్కార్‌ ఇస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు.. ఎవరి దగ్గరా చేయి చాపే అవసరం లేకుండా, అప్పు కోసం ఇల్లిల్లూ తిరిగే పని లేకుండా ఆత్మగౌరవంతో పొలం బాట పడుతున్నారు.. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. సోమవారం కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది.. మరికొన్ని రోజుల్లో అర్హులందరికీ నగదు అందనుంది.. - కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు వినిపించింది. వానకాలం పెట్టుబడి కోసం రైతుబంధు పథకం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి సీజన్లకు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి వానకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.  పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు పథకం  వర్తిస్తుంది. ఖమ్మం జిల్లాలో 2,98,085 మంది రైతులకు మొత్తం రూ.356.98 కోట్లు, భద్రాద్రి జిల్లాలో 1,34,112 మంది రైతులకు రూ.205.59 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. విడతల వారీగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. ఇప్పటికే ఎకరం లోపు ఉన్న ఖమ్మం జిల్లా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ అయింది. నేటి నుంచి కొత్తగూడెంలోని రైతులకు జమ కానున్నది. 2018 నుంచి రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.  

ఖమ్మం జిల్లాకు రూ.356.98 కోట్ల పంపిణీ
రైతుబంధు పథకం కింద ఖమ్మం జిల్లాకు రూ.356.98 కోట్లను పంపిణీ చేయనున్నారు. పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ వివరాలను సేకరించి  రాష్ట్ర వ్యవసాయ శాఖకు జాబితాను అందజేసింది. 2020 జనవరి నెలలోపు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన ప్రతి రైతు పూర్తి వివరాలను సేకరించారు. వానకాలం సీజన్‌కు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పట్టదారు పాసుపుస్తకం కలిగిన 2,98,085 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు గాను ఎకరానికి రూ 5వేల చొప్పున మొత్తం రూ 356.98 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.  అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు సొమ్ము అందాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం  సీఎం కేసీఆర్‌ జిల్లా కల్టెకర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. చిన్న కారు రైతుల నుంచి మొదలు కొని ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం జిల్లా  వ్యవసాయశాఖకు నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత సంత్సరం భూ క్రయవిక్రయాలు చేపట్టిన రైతుల వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు చేరవేసింది. అయితే ప్రతి ఏటా రైతులు భూ క్రయ విక్రయాలు జరుపుతుండడంతో రైతుబంధు పథకం అమలుకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని అధిగమించి పటిష్ట కార్యాచరణ తయారు చేశారు. ఇక నుంచి భూముల క్రయవిక్రయాలు జరిగితే మరుసటి సంవత్సరం నుంచి మాత్రమే సదరు రైతులకు రైతుబంధు వర్తించనుంది. 
21మండలాలు, 2.98 లక్షల మంది రైతులు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిదిలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులు 2,98,085 మంది ఉన్నారు. గత ఏడాది చివరి వరకు భూక్రయవిక్రయాలు జరిపి ఆన్‌లైన్‌లో నమోదైన రైతులకు సైతం ఈ వానకాలం పంటల పెట్టుబడి సొమ్ము అందనుంది. మండలాల వారీగా పరిశీలిస్తే కామేపల్లి మండలంలో 9,800 మంది, ఖమ్మం అర్బన్‌ మండలంలో 3,590మంది, రఘునాథపాలెం మండలంలో 15,206 మంది, ఖమ్మం రూరల్‌ మండలంలో 14,511, కూసుమంచి 16,882, నేలకొండపల్లి మండలంలో 17,418, తిరుమలాయపాలెం మండలంలో 18,138, బోనకల్లు మండలంలో 15,596, చింతకాని మండలంలో 15,933, మధిర మండలంలో 16,484, ముదిగొండ మండలంలో 16,484, ఎర్రుపాలెం మండలంలో 14,522, కల్లూరు మండలంలో 19,771, పెనుబల్లి మండలంలో 12,181, సత్తుపల్లి మండలంలో 12,470, తల్లాడ మండలంలో 15,714, వేంసూరు మండలంలో 16,607, ఏన్కూరు మండలంలో 8,205, కొణిజర్ల మండలంలో 14,233, సింగరేణి మండలంలో 10,736, వైరా మండలంలో 12,387 మంది అర్హత కలిగిన రైతులు ఉన్నారు. 
విడుతల వారీగా ఖాతాల్లో జమ.. 
వానకాలం సీజన్‌కు సంబంధించి రైతుబందు సొమ్ము  విడుతల వారీగా జమ కానుంది. ప్రణాళికబద్ధంగా ప్రతి రైతుకు పథకం వర్తించాలనే ఉద్దేశంతో పటిష్ట కార్యాచరణ తయారు చేశారు. సోమవారం నుంచి జిల్లాలో ఈ పక్రియ ప్రారంభం అయ్యింది. తొలుత ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు తొలివిడతలో, రెండవ దశలో రెండున్నర ఎకరాలలోపు, అనంతరం రెండు హెక్టార్లలోపు, అదే విధంగా 5-10 ఎకరాలు, తరువాత 10ఎకరాలు పైబడిన రైతులకు రైతుబంధు సొమ్ము అకౌంట్లలో జమ కానుంది. నెల రోజులోపు పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ప్రతి రైతుకు సొమ్ము అందే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. సాంకేతిక కారణాలతో ఎవరైన రైతులకు సొమ్ము జమ కాకుంటే సమస్యను పరిష్కరించేందుకు గ్రామ స్థాయిలో ఏఈఓ, మండల స్థాయిలో ఏఓ, జిల్లా స్థాయిలో జేడీఏ కార్యాలయం నోడల్‌ అధికారి పర్యవేక్షించనున్నారు. సీజన్‌కు అనుగుణంగా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 
కొత్తగూడెం జిల్లాకు రూ.205.59 కోట్లు
 కొత్తగూడెం జిల్లాకు రైతుబంధు పెట్టుబడి సాయం కింద రూ.205.59 కోట్లను పంపిణీ చేయనుంది. వానకాలం సీజన్‌లో జిల్లాలోని 1,34,112 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకోసం వ్యవసాయాశాఖ వానకాలం పంటను వేసే రైతుల జాబితాను సిద్ధం చేసింది. నియంత్రితసాగు చేయనున్న రైతన్నలకు తొలకరిలోనే రైతుబంధు సాయాన్ని వారి ఖాతాల్లో జమచేస్తుంది. రైతుబంధు సాయాన్ని గతేడాది నుంచి ఎకరానికి 5 వేలు ఇస్తుంది. ఇప్పటికే 1,20,300 మంది రైతుల వివరాలు బ్యాంకుల వద్దకు చేరాయి.    
నేటి నుండి భద్రాద్రి జిల్లా రైతుల
 ఖాతాల్లో రైతుబంధు జమ..
ప్రభుత్వం రైతులకు అందించే పంటపెట్టుబడి సాయం నేటి నుండి రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇప్పటికే బ్యాంకులకు చేరని రైతుల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉండటంతో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ సాయం సొమ్మును ఖాతాల నుంచి తీసుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
అర్హత కలిగిన 
ప్రతి రైతుకు పథకం వర్తింపు
పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న ప్రతి రైతుకు రైతుబంధు పథకం వర్తిస్తుంది. అయితే గతంలో మాదిరిగానే విడుతల వారీగా  సొమ్ము జమ అవుతుంది. రైతులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాగుకు అనువుగా రైతులకు పంటల పెట్టుబడి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సాంకేతిక సమస్యలు,  ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక ఏఈఓలను సంప్రదించవచ్చు. 
-అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి
 వానకాలం పంటకు సాయం.. 
వానకాలం పంటకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. నిధులు కూడా విడుదల అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.205.59  నిధులు బ్యాంకుల్లో ఉన్నాయి. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించండి. -కొర్సా అభిమన్యుడు,
       భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి


logo