నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరుకు చెందిన గుగ్గిళ్ల ముత్తిలింగం, రమాదేవి దంపతుల కుమారుడు. దివ్యమూర్తి తండ్రి రోజువారీ కూలి పనులు చేసుకుంటాడు. తల్లి రమాదేవి గృహిణి. ఇతడికి ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. తల్లిదండ్రులకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లోనే నివాసంలో ఉంటున్నారు. పదో తరగతి వరకు నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఏపీఆర్జేసీలో సీటు లభించడంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇంటర్ చదువుకున్నాడు. ఖమ్మంలోని బొమ్మా కళాశాలలో బీటెక్‌ను పూర్తి చేశాడు.
జ్ఞాపకశక్తి అమోఘం..
దివ్యమూర్తి చిన్నప్పటి నుంచీ క్విజ్ పోటీల్లో బాగా పాల్గొనేవాడు. ఎక్కడ క్విజ్ పోటీలు పెట్టినా అక్కడ అతను పాల్గొనడంతోపాటు తప్పనిసరిగా బహుమతిని గెల్చుకునేవాడు. అతడు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని కనబర్చేవాడు. అతడు ఒక్కసారి ఒక విషయాన్ని తెలుసుకుంటే దాన్ని ఎన్నటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేవాడు. అతడికి 12 అంకెల ఆధార్ నెంబర్‌ను చూపిస్తే చాలు.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే దాన్ని మననం చేసుకుంటాడు. తరువాత ఎన్నిసార్లు చెప్పమన్నా, ఎన్ని రోజులు తరువాత అడిగిన ఠక్కున చెప్పగలడు. అంకెలను ఎటునుంచి తిరగేసి అడిగినా తప్పులు లేకుండా చెప్పగలడు. తన ఫోన్లో ఒక్క నెంబర్‌ను కూడా సేవ్ చేసుకోడు.
ఎన్ని నెంబర్లనయినా తన మెదడులోనే భద్రపర్చుకుంటాడు. ఎప్పటికప్పుడు నెంబరును డయల్ చేయడం ద్వారానే ఫోన్ చేస్తాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల పేర్లు, దేశంలోని రాష్ర్టాల పేర్లు, వాటి రాజధానుల పేర్లు వంటివి వాటిని సెకన్ల వ్యవధిలోనే చెప్పగలడు. ప్రపంచంలోని వివిధ దేశాల పేర్లను కూడా అవలీలగా చెప్పగలడు. ఇతడు సుమారు రెండు వేల పుస్తకాలను చదవాడు. పలువురు సినీనటులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ మిమిక్రీ చేయగలడు. పాటలూ పాడుతుంటాడు. అన్ని విషయాలపైనా అవగాహన కలిగి ఉంటాడు. అనేక అంశాల గురించి ఐదుగంటలపాటు అనర్గళంగా మాట్లాడగలడు.
గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదిస్తా..
ఎప్పటికైనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలనేది నా కల. ఆర్థికంగా వనరులు లేకపోయినప్పటికీ ఉన్నత చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలనేది నా ఆశయం. అవకాశాలొస్తే మరింత ముందుకెళ్తా.
-గుగిళ్ల దివ్యమూర్తి