e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఖమ్మం పేదలకు భరోసా

పేదలకు భరోసా

  • గ్రామీణుల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి
  • 5 వేల జనాభాకు వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు
  • భద్రాద్రి జిల్లాకు 20 సెంటర్లు మంజూరు
  • 17 సెంటర్ల నుంచి అందుతున్న వైద్య సేవలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాధులతో సతమతమవుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు శ్రీకారం చుట్టింది. ప్రతి 5 వేల జనాభాకు ఒక వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో వైద్యం అందిస్తున్నది. ఈ సెంటర్లలో ప్రత్యేక వైద్యులను నియమించి పీహెచ్‌సీ తరహాలో వైద్యసేవలు అందిస్తోంది. భద్రాద్రి జిల్లాకు మొత్తం 20 వెల్‌నెస్‌ సెంటర్లు మంజూరు కాగా.. ఇప్పటికే 17 సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి.

అశ్వారావుపేట, సెప్టెంబర్‌ 14: ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృష్టి చేస్తోంది. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలకు పదును పెడుతోంది. రోగాలకు చికిత్స చేయించుకోవటానికి పేదలు తమ సంపాదనలో సగభాగం వెచ్చిస్తూ ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం పల్లెల్లోనే ప్రజల చెంతకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి 5 వేల జనాభాకు ఒక వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో నాణ్యమైన వైద్యం అందించేందుకు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు వ్యాధుల బారిన పడి సరైన చికిత్స చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి గ్రామంలోనే వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ఉచితంగా వైద్య సేవలతోపాటు మందులు కూడా పంపిణీ చేయనుంది. ఈ సెంటర్లలో ప్రతి రోగికి సంబంధించిన హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేసి భద్రపరుస్తారు.

- Advertisement -

‘జన ఆరోగ్య కమిటీ’లు ఏర్పాటు..
వెల్‌నెస్‌ సెంటర్లలో ‘జన ఆరోగ్య కమిటీ’లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి సర్పంచ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్‌ చైర్మన్‌గా పీహెచ్‌సీ ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కలిపి మొత్తం 15 మంది ఈ కమిటీలో ఉంటారు. వీరంతా కలిసి వైద్య సేవలను పర్యవేక్షిస్తారు. వెల్‌నెస్‌ సెంటర్‌ అభివృద్ధి, పారిశుధ్య పనుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు రవాణా కోసం ప్రభుత్వం ఏటా రూ.50 వేల నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత కమిటీలపై ఉంటుంది.

అందించే సేవలివే..
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లడమే వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. మందులనూ ఉచితంగా పంపిణీ చేస్తారు. వెల్‌నెస్‌ సెంటర్లలో హెల్త్‌ సబ్‌ సెంటర్లలో ఉండే విధంగానే ఏఎన్‌ఎంల స్థానంలో అర్హత గల వైద్యులు ఉంటారు. వ్యాక్సినేషన్‌, గర్భిణులకు పరీక్షలు, ప్రసూతి, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. బీపీ, షుగర్‌ పరీక్షలు, సాధారణ ఓపీ (ఔట్‌ పేషెంట్‌) సేవలతోపాటు ఉచితంగా మందులు అందిస్తారు. పక్షవాతం రోగులకు ఇంటి వద్దనే వ్యాయామం చేయిస్తారు. ఎవరైనా బాధితులు వెల్‌నెస్‌ సెంటర్‌కు వస్తే వారి నుంచి రక్ష నమూనాలు సేకరించి పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపుతారు. అక్కడి నుంచి వచ్చే ఫలితం ఆధారంగా చికిత్స, మందులు అందిస్తారు. వృద్ధులుంటే వారి ఇంటికెళ్లి మరీ వైద్య సేవలు అందిస్తారు.

ఇవే వెల్‌నెస్‌ సెంటర్లు..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మొదటి విడతలో 20 వెల్‌నెస్‌ సెంటర్లను మంజూరు చేసింది. వీటిలో 3 మినహా మిగతా 17 సెంటర్ల నుంచి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మంజూరైన వెల్‌నెస్‌ సెంటర్ల వివరాలు పరిశీలిస్తే రేగళ్ల పీహెచ్‌సీ ఆసుపత్రి పరిధిలో బంగారు చెలక, మైలారం, చాతికొండ-11, శ్రీనగర్‌, లక్ష్మీదేవిపల్లి, హేమచంద్రాపురం, కారుకొండ రామవరం, సీతారాంపురం, ఉల్వనూరు పీహెచ్‌సీ పరిధిలో పాండురంగాపురం, పెనగడప పీహెచ్‌సీ పరిధిలో 2 ఇన్‌ైక్లెన్‌, 3 ఇన్‌ైక్లెన్‌, 7 ఇన్‌ైక్లెన్‌, ఆనందఖని, పెనుబల్లి, గరీబ్‌పేట, గౌతమ్‌పూర్‌, ధన్‌బాద్‌-1, ధన్‌బాద్‌-2, పట్వారిగూడెం పీహెచ్‌సీ పరిధిలో లింగాలపల్లి, సూజాతనగర్‌ పీహెచ్‌పీ పరిధిలో పాత అంజనాపురం గ్రామాలు ఉన్నాయి. వీటిలో పెనుబల్లి, ఆనందఖని, 7 ఇన్‌ైక్లెన్‌ మినహా మిగతా సెంటర్లు ప్రారంభమయ్యాయి.

20 వెల్‌నెస్‌ సెంటర్లు మంజూరు..
భద్రాద్రి జిల్లాలకు మొత్తం 20 వెల్‌నెస్‌ సెంటర్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 17 సెంటర్ల ద్వారా పేదలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా జిల్లా వ్యాప్తంగా వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభించి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారిస్తోంది.

ప్రజల చెంతకు నాణ్యమైన వైద్య..
వెల్‌నెస్‌ సెంటర్ల ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి దోహదపడతాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేయాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. వెల్‌నెస్‌ సెంటర్లతో ప్రభుత్వ వైద్యం ప్రజల చెంతకు చేరుతోంది. ఇప్పటి వరకు పీహెచ్‌సీ ఆసుపత్రుల్లో అందించిన వైద్యసేవలను ఇకపై వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
-డాక్టర్‌ ప్రసాద్‌,జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌, కొత్తగూడెం

గ్రామీణ స్థాయిలో కార్పొరేట్‌ వైద్యం..
గ్రామీణ స్థాయిలో కార్పొరేట్‌ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతి రోగి హెల్త్‌ ప్రొఫైల్‌ అందుబాటులో ఉంటుంది. గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్యం చేరువవుతుంది. అవసరాన్ని బట్టి జిల్లా స్థాయిలోనూ రోగులకు చికిత్స చేయిస్తాం.
-డాక్టర్‌ నవజ్యోతి, వెల్‌నెస్‌ సెంటర్‌ వైద్యురాలు, రుద్రంపూర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana