e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home ఖమ్మం నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌

నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌

  • అపర భగీరథుడు బహదూర్‌ సాబ్‌
  • పాలేరు, వైరా జలాశయాల రూపశిల్పి ఆయనే..
  • వందేళ్లు దాటినా చెక్కు చెదరని ఖమ్మం మున్నేరు బ్రిడ్జి
  • నేడు రాష్ట్ర ఇంజినీర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌

ఖమ్మం, జూలై 10 : అలనాటి అపర భగీరథుడు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్‌. నదులను ఒడిసి పట్టి సాగు, తాగునీటి వనరులను భవిష్యత్‌ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు. నైజాం కాలంలో ఆయన నీటి వనరుల నిపుణుడిగా ప్రఖ్యాతిగాంచాడు. వలస పాలనలో ఆయన చరిత్ర మరుగున పడిపోయినప్పటికీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సర్కార్‌ ఆయన సేవలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన చేసిన కృషికి గాను ఏటా జూలై 11న నవాబ్‌ అలీ నవాబ్‌ జంగ్‌ బహదూర్‌ జయంతి సందర్భంగా ‘రాష్ట్ర ఇంజినీర్స్‌ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంజినీర్స్‌, సాంకేతిక నిపుణులు ఆయన సేవలను ప్రజలకు చాటి చెప్తున్నారు. నవాబ్‌ జంగ్‌ ఆయన దార్శనికతతో మన జిల్లాకు ‘జల వరాలు’ అందించారు. ఆ ప్రాజెక్టులపై నేడు ఇంజినీర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

విదేశాల్లో చదువు…
నైజాం కాలంలో 1877 జూలై 11న హైదరాబాద్‌లో జన్మించారు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌. ఈయన అసలు పేరు మీర్‌ అహ్మద్‌ అలీ. తండ్రి మీర్‌ వాయిద్‌ అలీ. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఇతని తండ్రి హైదరాబాద్‌ రాష్ట్రంలో ‘దఫ్తర్‌-ఏ-ముల్కి’గా పనిచేసేవారు. బహదూర్‌ సెయింట్‌ జార్జ్‌ గ్రామార్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశాడు నవాజ్‌ జంగ్‌. ఆ తర్వాత నిజాం కాలేజీలో నాలుగేళ్లు ఉన్నత విద్యను అభ్యసించాడు. గణితంలో ఇతని ప్రతిభను గుర్తించిన నిజాం ప్రభుత్వం 1896లో స్కాలర్‌షిప్‌ను మంజూరుచేసి ఇంగ్లాండ్‌లోని రాయల్‌ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించడానికి పంపింది. ఇదే నేటి కూపర్స్‌ హిల్‌ ఇంజినీరింగ్‌ కాలేజిగా ప్రసిద్ధి గాంచింది.. ఆ తర్వాత 1899లో ఇంగ్లాండ్‌ నుంచి తిరిగి వచ్చి అదే సంవత్సరం నిజాం ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగం ఇరిగేషన్‌ బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగి చీఫ్‌ ఇంజినీర్‌ అయ్యారు.

- Advertisement -

వరదాయిని పాలేరు జలాశయం..
మనం నేడు గొప్పగా చెప్పుకునే ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌, నిజాం సాగర్‌, దిండి, కోయల్‌సాగర్‌, కడెం , పోచంపాడు, లోయర్‌ మానేరు ప్రాజెక్టులన్నీ నవాజ్‌ జంగ్‌ నిర్మించినవే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ, అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రెరీ, ఉస్మానియా ఆస్పత్రి అన్నీ ఆయన కాలంలో రూపుదిద్దుకున్నవే. ఇదే ఒరవడిలో 1920లో గుర్రాలపై ఖమ్మం ప్రాంతానికి వచ్చారు నవాజ్‌ జంగ్‌. పాలేరు చెరువును చూసిన ఆయన అక్కడ ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నైజాం నవాబుకు తెలపడంతో ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 1922లో పనులు ప్రారంభిస్తే 1928 నాటికి పూర్తయ్యాయి. 1929లో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఏటా కుడి, ఎడమ కాలువల ద్వారా 2.5 టీఎంసీల నీరు 19,500 ఎకరాల ఆయకట్టుకు అందేలా ఆనకట్ట నిర్మించారు.

వైరా ప్రాజెక్టు నిర్మాణ శిల్పి..
వైరాకు సమీపంలో వైరా నదిపై 1923లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 1930లో పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద 17,390 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. వైరా, తల్లాడ, బోనకల్లు మండలాల్లోని సాగుభూములకు దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాలకు ఇక్కడి నుంచి వచ్చే వరద నీరే ప్రధాన ఆదరువు. ఈ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి.

మున్నేరు బ్రిడ్జి నిర్మించిందీ ఆయనే..
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు సమీపంలో మున్నేరుపై ఉన్న వంతెనకు 1917లో నవాజ్‌ జంగ్‌ పనులు ప్రారంభించారు. నాలుగేళ్లలో వంతెన పూర్తి చేశారు. పూర్తిగా రాయి కట్టుబడితో నిర్మించిన ఈ వంతెన వందేళ్లు పూర్తయినా చెక్కు చెదరక పోవడం ఆయన మేధస్సుకు తార్కాణం.

దార్శనికుడు నవాజ్‌ జంగ్‌
నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ గొప్ప దార్శనికుడు. తెలంగాణలో ప్రాంతంలో ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, జలాశయాలు, కట్టడాలు నేటికీ చెక్కు చెదరలేదంటే ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక దార్శనికుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌. నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ చరిత్రను ప్రపంచానికి తేలిసేలా చేశారు. అంతేకాదు ఆయన స్ఫూర్తితో బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు.

  • రాంబాబు, తెలంగాణ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌
నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌
నవాజ్‌ జంగ్‌ జల తరంగ్‌

ట్రెండింగ్‌

Advertisement