e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఖమ్మం ఆ ఇల్లు..నందనవనం!

ఆ ఇల్లు..నందనవనం!

ఆ ఇల్లు..నందనవనం!

ఏడుపదుల వయస్సులోనూ ఆమె సాగులో దూసుకెళ్తున్నారు. వ్యవసాయం రంగాల్లో అనేక మార్పులు వచ్చినా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏడూళ్లబయ్యారం పిచుకలగుంపునకు చెందిన మహిళా రైతు భాగం అరుణ.

సాగు.. సామాజిక సేవ
సాగు, సామాజిక సేవలో అరుణ తనదైన ముద్ర వేస్తున్నారు. తోటకూర, కొత్తిమీర, చుక్కకూర, పాలకూర, క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, కీరదోస, చిక్కుడు, టమాటా, మిర్చి, మునగ, బత్తాయి, నారింజ, సపోట, బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, మామిడి తదితర పండ్ల తోటలను సేంద్రియ ఎరువుతో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. అంతేకాదు, ఆమె సమాజసేవలోనూ ముందున్నారు. గ్రామంలోని నిరాశ్రయులైన మహిళలకు అండగా నిలుస్తున్నారు. వారికి సేంద్రియ ఎరువుల తయారీలో మెళకువలు నేర్పించి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి రాత్రిపూట అక్షరాలు నేర్పిస్తుంది. పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నది. శ్రమదానంతో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగింపజేస్తున్నది. మరుగుదొడ్ల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నది. తన సొంత ఖర్చుతో రెండు కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడం విశేషం. హరితహారంలోనూ చురుగ్గా పాల్గొని మొక్కలు నాటారామె. మొక్కలు మానవ మనుగడకు ఉయోగపడతాయని, పర్యావరణాన్ని కాపాడతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని హరితహారంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు అరుణ.

సేంద్రియ ఎరువుల తయారీలో దిట్ట
సాగులో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు, పొటాష్‌ తదితర రసాయన ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడుతున్నారు. ఇలా పండిన ఉత్పత్తులు తినడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సేంద్రియ ఎరువుతో పండించిన పంటలకు ఎటువంటి చీడపీడలు, రోగాలు దరిచేరవని చెబుతున్నారామె. వారం రోజుల్లోపు సేకరించిన ఆవుపేడ, ఆవుమూత్రం, కొంత బెల్లం, శనగలు, ఉలవలు, మినుములు ఏదైనా ఒక పప్పుల పొడిని తీసుకొని తక్కువ ఖర్చుతో పెరడులోనే సులభంగా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో కొంత సేంద్రియ ఎరువుతోపాటు మరికొంత జీవామృతాన్ని తయారు చేసుకొని పంటలకు వాడినట్లయితే చీడపీడలు దరిచేరవు. మంచి దిగుబడిని సాధించవచ్చు. ఆవుపేడ, ఆవుమూత్రంతో తయారు చేసిన జీవామృతాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చునని, పంటలకు పురుగు, దోమ, తెగులు రాదు. మొదట్లో సేంద్రియ ఎరువులతో కొంత దిగుబడి తగ్గినా రానురాను పెరుగుతుందంటున్నారు అరుణ.

పచ్చదనానికి ప్రాధాన్యం
పచ్చదనాన్ని పాధాన్యమిస్తున్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూల మొక్కలను పెంచుతూ ఇంటిని, పరిసరాలను పూలవనంగా మార్చారు. రకరకాల అరుదైన పూల మొక్కలను సేకరించి ఇంటి చుట్టూ నాటారు. అరుణ ఇల్లు ఓ పూదోట.. ఆమె ఇంటికి వెళ్లిన అతిథులకు పూలు, పండ్లను అందజేస్తున్నది. ఎవరికైనా పూలమొక్కలు కావాల్సి వస్తే ఉచితంగా అందజేస్తారు.

రైతులందరూ సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలి
వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగింది. వీటి ధరలకూ రెక్కలు వచ్చి పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఎరువుల అధిక వాడకంతో భూమి నిస్సారమవుతున్నది. దీంతో దిగుబడి తగ్గుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి చేకూరే సేంద్రియ సేద్యంపై దృష్టి పెట్టి సిరులు పండించాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. మహిళలు తమ పెరడుల్లోనే సేంద్రియ ఎరువులను సులభంగా తయారు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలి.
– మహిళా రైతు అరుణ

ఇవీ కూడా చదవండి..


ఆర్‌ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్‌..

అదే జ‌రిగితే వందేళ్లు వెన‌క్కి : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ ఇల్లు..నందనవనం!

ట్రెండింగ్‌

Advertisement