e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఖమ్మం ‘రెమ్‌డెసివిర్‌' కొరతకు చెక్‌

‘రెమ్‌డెసివిర్‌’ కొరతకు చెక్‌

‘రెమ్‌డెసివిర్‌' కొరతకు చెక్‌

ఖమ్మం జిల్లాకు రోజూ 1100 ఇంజెక్షన్లు సరఫరా
హెటెరోను ఒప్పించిన మంత్రి పువ్వాడ అజయ్‌
అదనపు కోటా ప్రైవేట్‌ వైద్యశాలల కోసమే
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి
ఖమ్మం సిటీ, మే 15: కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రంగంలోకి దిగారు. ఇటీవలే కొవిడ్‌ బాధితుల కోసం భద్రాచలం ఐటీసీని ఒప్పించి రోజుకు 5 మెట్రిక్‌ టన్నుల అదనపు ఆక్సీజన్‌ ఖమ్మానికి రప్పిస్తున్నారు. తాజాగా మహమ్మారి కాటుకు గురై ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యసేవలు పొందుతున్న ప్రజలందరి ప్రాణాలు నిలబెట్టే అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. కొవిడ్‌ బాధితులకు అపర సంజీవనిగా ఉపయోగపడుతున్న రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేకుండా చేశారు. రోజుకు ఏకంగా 1100 అదనపు ఇంజక్షన్లను ఖమ్మం జిల్లాకు కేటాయించారు. ఇంజక్షన్ల తయారీ సంస్థ అయిన హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారథిరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు కావడంతో చర్చలు జరిపారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని వివరించి చేయూతనందించాలని కోరారు. ఇంజక్షన్ల కొరత కారణంగా అనేక మంది అమాయకులు కన్నుమూస్తున్నారని, ప్రైవేట్‌ దవాఖానల్లో బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతున్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. సంస్థ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి చెప్పిన అంశాలతో ఏకీభవించిన హెటెరో అధినేత రోజుకు 1100 ఇంజక్షన్లను అదనంగా సరఫరా చేసేందుకు అంగీకరించారు.
ఎమ్మార్పీ ధరకే ఇంజెక్షన్‌..
కరోనా సెకండ్‌ వేవ్‌ కొన్ని ప్రైవేట్‌ దవాఖానలకు, కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దృష్ట్యా, ఎక్కువ మంది భయాందోళనలతో ప్రైవేట్‌ దవాఖానల దిశగా పరుగులు పెడుతుండటంతో వాటి యాజమాన్యాలు ఆక్సీజన్‌ లేదని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో లేవని అనాగరిక వైద్యానికి తెరలేపారన్నది జగమెరిగిన సత్యం. ప్రధానంగా ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ఒక్కొక్కదానికి రూ.30వేల నుంచి రూ.45 వేల వరకు దండుకుంటున్నారు. కరోనాతో ప్రైవేట్‌ మెట్లెక్కిన ఎవరైనా సరే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు లేకుండా బయటపడిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు. ఆక్సీజన్‌ కొరత తీర్చడం, టెస్టుల సంఖ్య పెంచేందుకు అవసరమైన కిట్లు రప్పించడం, కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు వేయించడం వంటి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్న ఆయన కొవిడ్‌ బాధితుల సంజీవని రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యసేవలు పొందుతున్న వారందరికీ ఎమ్మార్పీ ధరలకే ఇంజక్షన్లు లభించనున్నాయి.
బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి అజయ్‌
కరోనా వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్భంది సామాజిక కోణంలోనే చూడాలని మంత్రి అజయ్‌ పేర్కొన్నారు. ప్రధానంగా ప్రైవేట్‌ రంగంలోని వైద్యులు, యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో కొవిడ్‌ బాధితులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. ఇక నుంచి ప్రతిరోజూ ప్రైవేట్‌ దవాఖానలకు 1100 రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల అదనంగా రానున్నాయని, ఎవరైనా సరే ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆయన ఆదేశించారు. బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అదనంగా విక్రయాలు జరిపితే కలెక్టర్‌ కార్యాలయం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1077, అర్బన్‌ తహసీల్దార్‌ సెల్‌ నెంబర్‌ 9849906095, పోలీస్‌ శాఖకు చెందిన 100కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని మంత్రి అజయ్‌ సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘రెమ్‌డెసివిర్‌' కొరతకు చెక్‌

ట్రెండింగ్‌

Advertisement