e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home ఖమ్మం ఇంటింటికీ శుద్ధజలం!

ఇంటింటికీ శుద్ధజలం!

ఇంటింటికీ శుద్ధజలం!

ఖమ్మంలో ముగింపు దశకు భగీరథ పనులు
నగరంలో 80 వేల కుటుంబాలకు అందుతున్న తాగునీరు

ఖమ్మం, ఏప్రిల్‌ 1 : ‘రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా అయ్యేది. అదీ అర్ధగంట మాత్రమే. ఎత్తయిన ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ నీటి ఎద్దడే ఉండేది. దాహార్తిని తీర్చుకునేందుకు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇదీ.. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఖమ్మం ప్రజల దీనస్థితి. మరి ఇప్పుడు? పూర్తి భిన్నమైన పరిస్థితి. ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో రూపుదిద్దుకున్న పథకం మిషన్‌ భగీరథ. దీని ద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో ప్రజల గొంతు తడుస్తోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో భగీరథ పనులు ఖమ్మంలో ముగింపు దశకు చేరుకున్నాయి. ఫలితంగా ఇంటింటికీ సురక్షిత నీరందుతోంది. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రతి ఇంటికీ రోజుకు 150 లీటర్లు శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసే పనులు పూర్తికావొచ్చాయి. మొత్తం రూ.230 కోట్లతో ప్రారంభమైన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం ద్వారా రూ.115 కోట్లను కేటాయించింది. మిగిలిన రూ.115 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఖమ్మంలో ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాకు అదనంగా రాబోయే 15 ఏళ్లలో ఎలాంటి నీటి ఎద్దడీ తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

శరవేగంగా 18 ట్యాంకుల నిర్మాణం..
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం రోజుకు 37 ఎంఎల్‌టీ నీటిని, బోరు బావుల ద్వారా మరో 4 ఎంఎల్‌టీ నీటిని కేఎంసీ యంత్రాంగం సరఫరా చేస్తున్నది. దీనికి 14 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను వినియోగిస్తూ 31,600 నల్లాలకు నిరంతరం నీరందిస్తున్నారు. ఖమ్మంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్తగా 18 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. వీటిలో నాలుగు ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 14 ట్యాంకులు పూర్తి కావొస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ 18 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్‌ ట్యాంకుల నిర్మాణం ఒక వైపు శరవేగంగా జరుగుతున్నప్పటికీ నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా అధికారులు ట్యాంకుల వద్ద మెయిన్‌ పైపులైన్లకు బైపాస్‌ కనెక్షన్లు అందించి నీరందిస్తున్నారు.

దాదాపు 80వేల కుటుంబాలున్నాయి. మంచినీటి సరఫరా విషయానికి వస్తే కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ కలుపుకొని 31,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఉండాలని, ప్రతిరోజూ సరిపడా మంచినీటి సరఫరా జరుగాలి అనే సీఎం కేసీఆర్‌ ఆశయంలో భాగంగా ఖమ్మంలోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంటి యజమానికి పైసా ఖర్చు లేకుండా కనెక్షన్‌ అందిస్తున్నారు. గోడ కటింగ్‌ చార్జీలు లేవు. ట్యాపు, బాల్‌వాల్వ్‌, మీటరు, గేట్‌వాల్వ్‌, సపోర్ట్‌ రాడ్‌లనూ ఉచితంగానే అందిస్తున్నారు. వీటి ద్వారా నీటి వృథా ఉండదు. ఎత్తు పల్లాల సమస్యలుండవు. ఇప్పటికే 20 వేల ఇళ్లకు మీటర్లు బిగించారు.

భవిష్యత్‌ను అంచనా వేసి..
రానున్న 15 ఏళ్లకు సరిపడా నీరందించేందుకు మంచినీటి ట్యాంకులు, మరో 30 ఏళ్లకు వరకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పైపులైన్లకు మోటార్లు బిగించకుండా ప్రతి నల్లా కనెక్షన్‌కూ మీటరు బిగిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో ఇంటికి 150 లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయనున్నారు. ఖమ్మంలో పాత నల్లా కనెక్షన్లు 35 వేలు ఉండగా కొత్తగా మరో 45 వేల నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇప్పటి వరకు 36 వేల ఇండ్లకు కొత్తగా నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా మిగిలిన 9 వేల ఇళ్లకూ ఈ వారంలోపు నల్లా కనెక్షన్లు ఇవ్వడం పూర్తవుతుందని భగీరథ ఈఈ రంజిత్‌కుమార్‌ పేర్కొంటున్నారు.

30 ఏళ్ల దూరదృష్టితో నిర్మాణం
‘రానున్న 15 ఏళ్లలో ఖమ్మం ప్రజలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం. కేఎంసీలో రూ.230 కోట్లతో మొదలు పెట్టిన భగీరథ పనులు పూర్తయ్యాయి. ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. రాబోయే 30 ఏళ్ల వరకు ఖమ్మం నగరం విస్తరించే అంశాన్ని దృష్టిలోకి తీసుకొని వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేశాం.
-పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటింటికీ శుద్ధజలం!

ట్రెండింగ్‌

Advertisement