శనివారం 11 జూలై 2020
Khammam - May 26, 2020 , 02:44:14

డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో

డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో

ఖమ్మం ఎడ్యుకేషన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీలు షెడ్యూల్‌ విడుదల చేశాయి. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు నిర్వహణ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నాయి. కొన్ని పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ జరుగనున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించే వార్షిక పరీక్షలను విద్యార్థులు సులువుగా రాసేలా నూతన విధానాలు ఉండనున్నాయి. గతంలో మూడు గంటల పాటు నిర్వహించే పరీక్షలను ఈ సారి రెండు గంటలు నిర్వహించేందుకు ఆమోదించారు. ప్రశ్నాపత్రాల్లో చాయిస్‌ను పెంచనున్నారు. 

జూన్‌ 20 నుంచి బీటెక్‌ పరీక్షలు..

జవహ ర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్‌) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జరిగే ఇంజినీరింగ్‌ పరీక్షలను వచ్చే నెల 20వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదలైంది. గతంలో పార్ట్‌-1, పార్ట్‌-2లో ప్రశ్నలు ఉండేవి. పార్ట్‌-1లో చాయిస్‌ ఉండదు. పార్ట్‌-2లో మాత్రమే చాయిస్‌ ఉండేది. ఇప్పుడు అన్నింట్లో చాయిస్‌ ఉండేలా ప్రశ్నాపత్రాలు ఉండబోతున్నాయి. ఒక్కో పరీక్ష 2 గంటల వ్యవధిలో పూర్తి కానుంది. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే డిగ్రీ పరీక్షలు సెమిస్టర్‌ విధానంలో జరుగనున్నాయి. 1,3,5 సెమిస్టర్‌ పరీక్షలు ఒక రోజు, 2, 4, 6వ సెమిస్టర్‌ పరీక్షలు మరుసటి రోజు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగనున్నాయి. డిగ్రీ పరీక్షలకు సైతం 2 గంటల సమయం కేటాయించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్‌ 10వ తేదీ వరకు అవకాశం ఉంది.

ఉత్తీర్ణత అయ్యే వారి సంఖ్య ఎక్కువ..

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు పరీక్షలను సులభమైన రీతిలో పూర్తి చేయనున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో సైతం పరీక్షల సమయం తగ్గించి, చాయిస్‌ కల్పించినట్లు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రెండు, మూడు ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాసేలా చాయిస్‌ కల్పిస్తూ ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు కొన్నిచోట్ల ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ జరుగుతున్నది.

ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్‌ వైవా.. 

ఇంజినీరింగ్‌ కోర్సు చివరి సంవత్సరంలో ప్రతి విద్యార్థి ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నామినేట్‌ చేసిన అధ్యాపకులు ప్రాజెక్ట్‌ పనితీరు, విద్యార్థి సామర్థ్యాల ఆధారంగా మార్కులు, గ్రేడ్‌లు కేటాయిస్తారు. ఈ సంవత్సరం భౌతిక దూరం పాటించాల్సి రావడంతో పాటు విద్యాసంస్థలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో వైవా నిర్వహించేలా జేఎన్టీయూహెచ్‌ షెడ్యూల్‌ ఇచ్చింది. జేఎన్టీయూ హెచ్‌, జేఎన్టీయూ జగిత్యాల, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం వైవాలో పాల్గొంటున్నారు. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వైవా పూర్తి చేయాలని, వాటిని రికార్డ్‌ చేయాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు. కొన్ని కళాశాలల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా, మరికొన్ని కళాశాలల్లో పూర్తి కావాల్సి ఉంది. వైవా పూర్తి చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని ఎనిమిది ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు హాజరుకానున్నారు.logo