e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఖమ్మం అమ్మ దీవెన!

అమ్మ దీవెన!

అమ్మ దీవెన!

ఐసొలేషన్‌ కేంద్రాలకు ప్రతిరోజు భోజనం సరఫరా
ప్రతినిత్యం బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే దంపతులు
పాలు పంచుకుంటున్న హరిప్రియ సేవా సమితి బృందం

ఇల్లెందు, మే 25 :ఆపదలో ఆదుకున్న వారే నిజమైన ప్రజా సేవకులు.. ఇది అక్షరాల నిజం చేస్తున్నారు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ దంపతులు. వారు కొవిడ్‌ బాధితులకు అండగా ఉండాలని సంకల్పించారు. ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భర్తతో కలిసి రోజు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్నారు. బంధువులు చూడడానికి, భోజనం తేవడానికి ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్యే హరిప్రియ ఐసొలేషన్‌లో ఉన్నవారికి భోజనం సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటల బాధితులకు భోజనం అందజేస్తున్నారు. రోజువారీగా వైద్యులతో సమీక్షిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడవద్దని, అవసరమైతే సొంత ఖర్చులు భరిస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం హరిప్రియ సేవా సమితి సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ ఇటీవల కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో కొవిడ్‌ బాధితులను ఇంటింటికి తిరిగి పరామర్శించారు. అక్కడ ఓ కుటుంబం స్థితిగతులు, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని చూసి భార్యాభర్తలు చలించిపోయారు. వైద్యులతో మాట్లాడితే మెరుగైన వైద్యం కావాలన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి హరిప్రియ దంపతులు అండగా నిలిచారు. కుటుంబ భారమంతా మోస్తామని దగ్గరుండి ఖమ్మం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కోలుకొని తిరిగి వచ్చారు. హరిప్రియ దంపతుల వల్లే ప్రాణాలతో ఇంటికి చేరామని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అమ్మా అని ఫోన్‌ చేస్తే ఆదుకుంటారని ప్రతి గడపకు వెళ్లి మనోధైర్యం కల్పిస్తారని చెబుతున్నారు. ఏ సమయంలోనైనా బాధితులకు అందుబాటులో ఉంటామని వారు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అత్యవసరమనుకుంటే మెరుగైన వైద్యం కోసం మరోచోటుకు తరలించాలని వైద్యసిబ్బందికి సూచిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో తగిన మందులు లేకపోతే ప్రైవేట్‌ మందులను సొంత ఖర్చులతో తెప్పిస్తామని వైద్యులకు భరోసానిస్తున్నారు. ఐదు మండలాల్లోని ఐసొలేషన్‌ కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించి వారికి భోజనం అందజేస్తున్నారు. ఇల్లెందు, గార్ల , బయ్యారం, టేకులపల్లి, కామేపల్లి మండలాల వారీగా ప్రతీరోజు ఐసొలేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటూ..
వైద్యులకు ఎప్పటికప్పుడు చరవాణి ద్వారా అందుబాటులో ఉంటూ బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అధికంగా కొవిడ్‌ ఉన్న గ్రామాలకు వెళ్లి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఆర్థికసాయంతోపాటు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం తదితర వస్తువులు అందజేస్తున్నారు. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే మిగతా వ్యక్తులంతా వేరే ఊరు వెళ్లి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. మరికొందరు దహన సంస్కారాలకు హాజరు కాలేక మృతదేహాలను మున్సిపాలిటీలకే అప్పగిస్తున్న సందర్భాలున్నాయి. మృత్యువును ఎదిరిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పర్యటనకు ఎమ్మెల్యే దంపతులు శ్రీకారం చుట్టడం అసాధారణ ప్రక్రియ అని వైద్యులే పేర్కొంటున్నారు.
మధ్యాహ్నం.. రాత్రి భోజనం
రోజువారీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు ఐదువందల మందికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేసి ప్యాకెట్ల ద్వారా నియోజవకర్గంలోని ఐదు ఐసొలేషన్‌ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈ ఖర్చంతా ఎమ్మెల్యే భరిస్తున్నారు. రోజూ మధ్యాహ్నం చికెన్‌, పప్పు, సాంబారు, రెండు కూరలు బాధితులకు అందిస్తున్నారు. రాత్రికి టమాట గుడ్డు, పప్పు, సాంబారును సరఫరా చేస్తున్నారు. ఉదయం, రాత్రి రోజుకు వెయ్యి భోజనాలు చొప్పున ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. క్రతువులో హరిప్రియ సేవాసమితి బృందం అసాధారణంగా శ్రమిస్తున్నది. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు భోజన కార్యక్రమంలో నిమగ్నమవుతున్నారు. సరఫరా చేసే బాధ్యతను సభ్యులే తీసుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మ దీవెన!

ట్రెండింగ్‌

Advertisement