e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఖమ్మం ఊరూరా వృక్షార్చన

ఊరూరా వృక్షార్చన

ఖమ్మంలో మంత్రి పువ్వాడ, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు
ఎక్కడికక్కడే పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సన్నద్ధం
కేక్‌ కటింగ్‌లు, రక్తదాన శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు
50 స్కూటీలను విరాళంగా ప్రకటించిన మంత్రి అజయ్‌

ఖమ్మం, జూలై 23,(నమస్తే తెలంగాణ ప్రతినిధి):యువనేత, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం జిల్లా వాసులు ఊరూరా వృక్షార్చన నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఊరూరా మొక్కలు నాటేలా ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చేపట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేసేలా ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, ఈ సారి మంత్రి పువ్వాడ దివ్యాంగులకు 50 స్కూటీలు పంపిణీ చేయనున్నారు.

యువనేత, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సన్నద్ధమయ్యారు. పది శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

- Advertisement -

విజయవంతం చేసేలా మంత్రి పర్యవేక్షణ
శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా హరితహారం కొనసాగుతున్నది. ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటుతున్నారు. అయితే, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజున ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ఒక్కొక్క మొక్క నాటి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.

ఖమ్మంలో భారీగా ఏర్పాట్లు..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచనల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ముక్కోటి వృక్షార్చనను పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలు, టీఆర్‌ఎస్‌ యువజన, విద్యార్థి విభాగం నాయకులు భారీగా మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లతోపాటు రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో వృక్షార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగనుంది. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ఖమ్మం నగరంలోని వీడివోస్‌కాలనీలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సన్మాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కడెం నుంచి ప్రత్యేక మొక్కలు తెప్పించారు. పలు డివిజన్లలో మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ సూచించారు.

ఊరూరా మొక్కలు నాటేలా..
ఊరూరా మొక్కలు నాటేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కూసుమంచి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో ముక్కోటి వృక్షార్చన చేపట్టనున్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా పట్టణంలో ఓ ప్రైవేటు వెంచర్‌, సిరిపురం గ్రామం, కొణిజర్ల మండలం తనికెళ్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పాల్గొననున్నారు. మధిర నియోజకవర్గంలో బోనకల్‌లో పది వేల మొక్కలు, మధిర మండలంలోని 10 వేల మొక్కలు నాటేలా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ప్రణాళిక రూపొందించారు. ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని మండలాల్లో ముక్కోటి వృక్షార్చన చేపట్టనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో 5వేల మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్‌డొనేషన్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మణుగూరులోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ఏరియాల్లో 20 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు హాజరుకానున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం నల్లగుంట, అచ్చుతాపురంరోడ్‌లో ముక్కోటి వృక్షార్చనలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొననున్నారు.

50 త్రీవీలర్స్‌ విరాళం ప్రకటించిన మంత్రి
పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌ ఏటా ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ సారి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 100 స్కూటీలను విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. గతేడాది కరోనా నివారణకు ప్రత్యేక అంబులెన్స్‌లు విరాళంగా ఇచ్చిన మంత్రి కేటీఆర్‌ ఈ సారి దివ్యాంగుల కోసం స్కూటీలను ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌ సూచనతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం 50 స్కూటీలు అందించేందుకు ముందుకొచ్చారు. పువ్వాడ అజయ్‌ స్కూటీలను విరాళంగా ప్రకటించడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘ముక్కోటి వృక్షార్చన’కు చిట్టిచేతుల శ్రీకారం
తల్లాడ, జూలై23: ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి బాలలు శ్రీకారం చుట్టారు. భారీ వర్షాల దృష్ట్యా ముందస్తుగా శుక్రవారం తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో ప్రాథమిక పాఠశాల దత్తత స్వీకర్త 8వ తరగతి విద్యార్థి దుగ్గిదేవర శ్రీరఘునందన్‌ ఆధ్వర్యంలో బాలలు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మల్లవరం గ్రామంలోని ఇంటి ఆవరణల్లో మొక్కలు నాటి గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. నేరేడు, బొప్పాయి, బాదం, వేప, తులసి, కానుగ, తురాయి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తుటారి సాయికిరణ్‌, శ్రీనిఖిల్‌, ధనకొండ లోహితనాథ్‌, గౌతమ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana