బుధవారం 03 మార్చి 2021
Khammam - Feb 23, 2021 , 03:14:56

ఉత్తీర్ణత సాధించేలా..

ఉత్తీర్ణత సాధించేలా..

  • ఇంటర్‌ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న అధ్యాపకులు
  • పాఠాలతోపాటు స్టడీ అవర్స్‌
  • ఆన్‌లైన్‌లోనూ పర్యవేక్షణ చేస్తున్న ప్రిన్సిపాళ్లు

ఖమ్మం ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 22: కరోనా కాలంలోనూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఆపైన తరగతుల పాఠాలను ప్రత్యక్ష పద్ధతిన బోధిస్తోంది. విద్యార్థి దశలో కీలకంగా భావించే ఇంటర్‌ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు వారిని సన్నద్ధం చేస్తున్నారు. పాఠాలు బోధించడంతోపాటు ప్రత్యేకంగా స్టడీ అవర్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 19 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ప్రణాళిక రూపొందించారు. నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తున్నారు.

చాయిస్‌కు అనుగుణంగా..

ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షా విధానాల్లో ఇంటర్‌ బోర్డు చాయిస్‌ను అమలు చేయనుంది. బోర్డు కల్పించే చాయిస్‌ను పరిగణనలోకి తీసుకుంటూనే 70 శాతం సిలబస్‌పై విద్యార్థులు పూర్తిగా పట్టు సాధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నారు. జనవరి నెల వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ బోధనలో అత్యధిక సిలబస్‌ పూర్తయింది. ఫిబ్రవరి 1 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యక్ష తరగతుల్లో కూడా ఇప్పటి వరకూ 40 శాతం సిలబస్‌ను పూర్తి చేశారు. ప్రాధాన్యం కలిగిన పాఠాలకు నోట్స్‌ ఇస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షలు మే 1 నుంచి మే 20 వరకు జరుగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపుల్లో కలిపి రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 6,350 మంది పరీక్షలు రాయనున్నారు. 

స్టడీ అవర్స్‌..

కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం తరగతులతోపాటు మధ్యాహ్న సమయంలో గంటన్నర సేపు స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. స్టడీ అవర్స్‌లో చదివిన వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ రెండు ప్రశ్నలు ఇస్తున్నారు. వాటిని చదివించి పరీక్షలు నిర్వహించే పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మరో రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి. దూరదర్శన్‌, యూట్యూబ్‌లోనూ పాఠాలు చెబుతున్నారు. పాఠాలను వీడియో రికార్డు చేసి వాట్సాప్‌ల్లో విద్యార్థులకు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ సమయంలో విద్యార్థులకు అధ్యాపకులు, ప్రి న్సిపాళ్లు అందుబాటులో ఉంటున్నారు.

VIDEOS

logo