శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Khammam - Feb 23, 2021 , 03:15:11

ఈజీఎస్‌'లో రికార్డు

ఈజీఎస్‌'లో రికార్డు

  • ‘ఉపాధి’ కల్పన.. వేతనాల చెల్లింపుల్లోఅరుదైన ఘనత
  • జిల్లాలో నాలుగేళ్లలో రూ.55,535 కోట్ల చెల్లింపులు
  • ఈ ఏడాది 6,64,790 మంది కూలీలకు జాబ్‌కార్డులు
  • 3,713 మంది దివ్యాంగులకూ ‘ఉపాధి’ హామీ 
  • కాల్వల పూడికతీత, మరమ్మతులు, వనాల పెంపకం
  • పేదలకు చేతినిండా పనికల్పిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • ఉపాధి హామీ పనుల్లో ఖమ్మం జిల్లా ముందంజ
  • వేసవి నుంచి అదనపు చెల్లింపులకు ఉత్తర్వులు

ఖమ్మం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ఉపాధి హామీ పనుల ద్వారా గడిచిన నాలుగేళ్లుగా రూ.55,535 కోట్లను చెల్లించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.14,089.12 కోట్లను అందజేసింది. జిల్లాలో జాబ్‌ కార్డులున్న కుటుంబాలు జిల్లాలో నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. 2017-18లో 2,78,049 కుటుంబాల్లో 6,23,197 మందికి వ్యక్తిగత జాబ్‌ కార్డులు ఉన్నాయి. 2020-21లో 2,96,445 కుటుంబాల్లో 6,64,790 మందికి వ్యక్తిగత జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఈజీఎస్‌ కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున దినసరి వేతనాన్ని అదనంగా ఇవ్వనుంది. దీంతో జిల్లాలోని వేలాది మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో పనిలేని కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో శాశ్వత పనులు చేపట్టారు.  

వ్యవసాయానికి అనుసంధానంగా..

ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పంట కాలువల పూడికతీత పనులు ఖమ్మం జిల్లాలో చేపట్టారు. 560 కిలోమీటర్ల మేర ఉన్న పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలని, పూడికతీత తీయాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌ ఆదేశించారు. నిరుడు సత్తుపల్లి నియోజకవర్గంలోని పంట కాలువల్లో మొత్తం 350 కిలోమీటర్ల మేర పూడికతీశారు. సత్తుపల్లి మండలంలోనే 2500 మంది ఉపాధి కూలీలు, 12 జేసీబీల ద్వారా బేతుపల్లి పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని 23 కిలోమీటర్ల మేర పంటకాలువలను శుభ్రపర్చారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లోని కాలువల్లో పూడికతీత పనులు జరిగాయి. 

లాక్‌డౌన్‌లోనూ ఆగని ‘ఉపాధి’

నిరుడు లాక్‌డౌన్‌ కాలంలోనూ జిల్లాలో ఉపాధి పనులు కొనసాగాయి. లాక్‌డౌన్‌ సమయంలో పట్టణాల నుంచి పల్లెలకు వచ్చిన వారిని ఈజీఎస్‌ పనులే ఆదుకున్నాయి. 

పనులతో ప్రభుత్వం ఆదుకుంది..

‘పనుల్లేక గతంలో వలసపోయే వాళ్లం. కానీ వలసలు పోకుండా తెలంగాణ సర్కారు ఉపాధి పనులు కల్పించి ఆదుకుంటోంది. ఈజీఎస్‌ పనులు ఉండటంతో రోజూ కూలి దొరుకుతోంది. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం సమయానికి ఇంటికి వస్తున్నాం. కూలి గిట్టుబాటు అవుతోంది.’ 

-డీ.రమణ, పువ్వాడ ఉదయ్‌నగర్‌

ఉపాధి పనులే కడుపు నింపుతున్నాయి..

‘మేం కూలి పనులపైనే ఆధారపడేవాళ్లం. మా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు రోజూ వెళ్తున్నాం. ఈజీఎస్‌ పనులే కడుపునింపుతున్నాయి. కరోనా కష్ట కాలంలో ఉపాధి పనులు లేకపోతే మేం చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఏటా 150 రోజులు పని కల్పిస్తుండడంతో ఉపాధికి ఢోకా ఉండడం లేదు. కూలి డబ్బులు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయి.’

-టీ.సుజాత, పువ్వాడ ఉదయ్‌నగర్‌


VIDEOS

logo