‘స్మార్ట్' ప్రిపరేషన్

- త్వరలో రాష్ట్రంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు
- కరోనా భయంతో తెరుచుకోని కోచింగ్ సెంటర్లు
- ప్రభుత్వ ప్రకటనతో ఊపందుకున్న ఆన్లైన్ క్లాసులు
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు యువత సన్నద్ధమవుతున్నారు. కొవిడ్ కారణంగా కోచింగ్ సెంటర్లు తెరుచుకోకపోయినా ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకుంటున్నారు. బీసీ స్టడీ సర్కిల్ కూడా ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షల తరగతులు నిర్వహిస్తోంది.
పరీక్షల తరగతులుస్క్రీన్పై పాఠాలు..
ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అభ్యర్థులందరూ శిక్షణ కోసం అధిక సంఖ్యలో ‘చలో హైదరాబాద్' అనేవారు. అక్కడి వరకు వెళ్లలేని వారు ఖమ్మంలో శిక్షణ పొందేవారు. కోచింగ్ సెంటర్లలో ఒక్కో బ్యాచ్‌కు వందలాది మంది అభ్యర్థులు ఉండేవారు. దీని వల్ల చాలా సమస్యలు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్‌తో ఆ సమస్యలేమీ లేవు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఫ్యాకల్టీ కూడా నేరుగా తమకే క్లాసు చెబుతున్న అనుభూతి కలుగుతున్నది.
ఎప్పుడైనా చదువుకునే చాన్స్..
కోచింగ్ సెంటర్ శిక్షణను కొందరు అభ్యర్థులు మెరికల్లా అర్థం చేసుకుంటే, మరికొందరు అభ్యర్థులు నెమ్మదిగా అర్థం చేసుకునే కొందరికి అర్థమయ్యే సమయానికి మరో అంశం బోధించడం మొదలవుతుంది. దీంతో మొదటిది అర్థం కాని వారు తర్వాత కూడా అదే సందిగ్ధంలో పడి మిగతావి కూడా వినడం వదిలేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ శిక్షణలో వారికి అర్థం కాని దగ్గర ఆగి.. మళ్లీ మళ్లీ వినే అవకాశం ఉంటోంది. దీంతో తర్వాత అంశాలను కూడా సలువుగా అర్థం చేసుకునేందుకు వీలవుతోంది. పైగా కోచింగ్ ఫీజులు, వసతి ఖర్చులు కలిసివస్తాయి.
ఆందోళన లేకుండా..
తరగతిలో జరిగిన శిక్షణలో కేవలం క్లాసు జరిగిన సమయంలో మాత్రమే విద్యార్థి పాఠాలు వినేందుకు వీలుండేది. అనివార్య కారణాల వల్ల విద్యార్థి ఆ రోజు క్లాసుకు రాకపోతే ఆ క్లాసు మిస్సయినట్లే. ఆన్లైన్ కోచింగ్‌లో ఈ సమస్య లేదు. విద్యార్థి తనకు అనుకూలమైన సమయంలో ఆ వీడియోలను చూసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ శిక్షణ సంస్థలు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, సివిల్స్ సహా వివిధ పోటీ పరీక్షలకు ఆన్లైన్లోనే కోచింగ్ ఇస్తున్నాయి. తక్కువ ఫీజుతోనే ఆన్లైన్లో క్లాసులు వినే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. అతి తక్కువ ఫీజుతో ఎన్నో కోర్సుల్లో శిక్షణ పొందొచ్చు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో..
బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు బీసీ స్టడీసర్కిల్ ఆన్లైన్లో నాణ్యమైన శిక్షణ ఇస్తోంది. మూడు నెలలుగా గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, బ్యాంకింగ్ ఉద్యోగాల శిక్షణ అందిస్తోంది. అభ్యర్థులకు ఒక వాట్సప్ గ్రూపు తయారుచేసి దాని ద్వారా ఆన్లైన్ లింక్‌లు పంపించి తరగతులు నిర్వహిస్తున్నారు.
అన్ని శిక్షణలూ ఆన్లైన్లోనే..
కొలువు సాధించాలంటే ప్రతి అంశంపైనా పట్టుండాలి. అందుకు ఎన్నో పుస్తకాలు చదవడంతోపాటు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. శిక్షణ కూడా ఎంతో కీలకం. వీటన్నింటినీ కోచింగ్ సెంటర్ కేంద్ర బిందువుగా నిర్వహకులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అందించేవారు. ప్రస్తుతం సంప్రదాయ తరగతి గది శిక్షణ సాధ్యం కాకపోవడంతో ఆన్లైన్ శిక్షణ ప్రత్యామ్నాయంగా మారింది. సిలబస్ ఆధారంగా సబ్జెక్టులు నేర్చుకునేందుకు యూట్యూబ్‌లో పాఠాలు వింటున్నారు. సందేహాలను, సలహాలను సైతం నిపుణులు ఆన్లైన్లోనే నివృత్తి చేస్తున్నారు.
ఆన్లైన్లోనే టెస్టులు..
నేలకొండపల్లికి చెందిన నరేశ్.. లాక్డౌన్ ముందు వరకు హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లో గ్రూప్స్‌కు శిక్షణ పొందారు. కరోనా నేపథ్యంలో అవి తెరుచుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రాక్టీస్ టెస్టులు కూడా రాస్తున్నారు.
ఆన్లైన్ ఇంటర్వ్యూ.. ఆపై ఉద్యోగం
ఖమ్మం నగరానికి చెందిన నిఖిత హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటూ అర్థమేటిక్ తరగతులను ఆన్లైన్లో నేర్చుకుంది. తద్వారా టీసీఎస్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొని సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. ఈ విజయంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు గ్రూప్స్ కోసం ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటోంది.
సమయం వృథా కాకుండా తరగతులు..
‘పోటీ పరీక్షలను సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణకు ఎలాంటి ఆటంకాలూ లేవు. సమయం వృథా కాకుండా విజయవంతంగా తరగతులు బోధిస్తున్నాం.
-జీ శ్రీలత, బీసీ స్టడీ సర్కిల్, డైరెక్టర్, ఖమ్మం
ఆన్‌లైన్‌తో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం..
‘అత్యుత్తమ ఫ్యాకల్టీలు, కోర్సు ఫీజులు, ఇతర ఖర్చులు.. ఇలా ఏ అంశం చూసుకున్నా ఆన్లైన్ శిక్షణ వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలోని అత్యుత్తమ ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పించడంతోపాటు లేటెస్ట్ 4కే టెక్నాలజీలో వీడియో షూటింగ్, రియల్ టైం గ్రాఫిక్ యానిమేషన్స్, డిజిటల్ బోర్డుల ద్వారా విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నాం.
- కరీం, సీనియర్ ఫ్యాకల్టీ
తాజావార్తలు
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
- నల్లగొండకు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు
- జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల