గురువారం 25 ఫిబ్రవరి 2021
Khammam - Jan 25, 2021 , 01:33:49

ఇక నుంచి ఓటీపీతో..

ఇక నుంచి ఓటీపీతో..

  • రేషన్‌ బియ్యం పంపిణీ అమలుకు కొత్త విధానాలు
  • ఐరిష్‌ విధానాన్ని కూడా పాటించేలా ఏర్పాట్లు 
  • ఫిబ్రవరి 1 నుంచి అమలుకు ప్రభుత్వ శ్రీకారం
  • వేలిముద్రలు పడని వారికి తప్పనున్న తిప్పలు
  • క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న డీటీలు

 ఖమ్మం, జనవరి 24 : రేషన్‌ సరుకుల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ), ఐరిష్‌ విధానాల్లో నిత్యావసర స రుకుల  సరఫరాకు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఖమ్మం  జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్‌కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉన్న వారికి మాత్రమే ఓటీపీ వస్తుంది. అలా లేకుండా ఉన్న లభ్ధిదారుల విషయంలో ఐరిష్‌ విధానాన్ని పాటిస్తారు. ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో రేషన్‌ కార్డుదారులు తమ ఆధార్‌ నెంబరుకు ఫోన్‌ నెంబరును అనుసంధానం చేసుకుంటున్నారు. మరో వైపు రేషన్‌ డీలర్లు కూడా తమ వద్ద ఉన్న ఐరిష్‌ యంత్రాలను సరిచూసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి వేలిముద్రల ద్వారా రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయనందున లబ్ధిదారులు తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రేషన్‌ డీలర్ల వద్దకు వస్తున్నారు. 1వ తేదీకి ఇంకా సమయం ఉన్నందున ముందుగానే ఐరిష్‌, ఓటీపీ విధానాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఉమ్మడి ఖమ్మంలో 1,112 రేషన్‌ దుకాణాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,112 రేషన్‌ దుకాణాలున్నాయి. జిల్లాల విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోకి 669 దుకాణాలు, భద్రాద్రి కొత్తగూడెంలోకి 443 దుకాణాలు వెళ్లాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,71,339 రేషన్‌ కార్డుదారులున్నారు. వీరిలో అన్నపూర్ణ కార్డులు రెండు. ఆహారభద్రత కార్డులు 6,27,178. అంత్యోదయ కార్డులు 17,573. 

ఓటీపీ, ఐరిష్‌తో తొలగనున్న ఇబ్బందులు..

కరోనా కారణంగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి నవంబర్‌ వరకు బియ్యాన్ని ఉచితంగా అందజేసింది. డిసెంబర్‌ నుంచి పాత పద్ధతిలోనే కేజీ బియ్యాన్ని రూపాయికే అందిస్తోంది. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌ మిషన్ల ద్వారా ఆధార్‌కు అనుసంధానమైన వేలిముద్రలతో రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులను తీసుకునే వీలుండేది. వృద్ధులకు, కూలీలకు వేలిముద్రలు పడకపోవడం వల్ల సరుకులను తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఓటీపీ లేదా ఐరిష్‌ విధానాల ద్వారా రేషన్‌ బియ్యాన్ని, ఇతర సరుకులను అందించాలని నిర్ణయించింది. 

VIDEOS

logo