శుక్రవారం 05 మార్చి 2021
Khammam - Jan 24, 2021 , 03:27:12

వేగంగా.. సులభంగా..

వేగంగా.. సులభంగా..

  • రైతుల భూసమస్యలకు పరిష్కార వేదికగా ధరణి పోర్టల్‌ 
  • హక్కుపత్రాలు పొంది మురిసిపోతున్న కర్షకులు
  • జోరుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు
  • ఖమ్మం జిల్లాలో బుకింగ్‌ స్లాట్లు: 4,675
  • నేటి వరకు పూర్తయినవి: 4,572

ఖమ్మం, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబర్‌ 2న ‘ధరణి’ పోర్టల్‌ను ప్రారంభించారు. అన్నదాతల సమస్యల పరిష్కారాకి అది చక్కని వేదికైంది. తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చాక కొద్దిసేపట్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఈ-పాస్‌బుక్‌ పత్రాలు చేతికి అందుతుండడంతో కర్షకులు ఆనందంతో తిరిగి వెళ్తున్నారు. ఈ రెండున్నర నెలల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4,675 స్లాట్లు నమోదు కావడం, వాటిల్లో 4,572 స్లాట్లు పూర్తికావడం ధరణి వేగానికి నిదర్శనంగా కనిపిస్తోంది. 

ఖమ్మం జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు..

ధరణి పోర్టల్‌ ద్వారా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఖమ్మంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 400 రిజిస్ట్రేషన్లు జరిగాయి. బోనకల్లు, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్‌, రఘునాథపాలెం మండలాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అధికంగానే ఉన్నాయ. స్లాట్లు కూడా ఈ మండలాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 377 రెవెన్యూ గ్రామాలున్నాయి. ధరణి రిజిస్ట్రేషన్ల నమోదుకు 1/70 చట్టం అడ్డంకిగా ఉంది. ప్రభుత్వం నిరిష్ట్దమైన ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని అధిగమిస్తూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

ఆరేళ్ల సమస్యకు పది నిమిషాల్లో పరిష్కారం.. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ శివాయిగూడెంలో ఆరేళ్లుగా పరిష్కారంకాని సమస్య ధరణి ద్వారా పది నిమిషాల్లో పూర్తయింది. సర్వే నెంబర్‌ 214లో నాగమణి అనే మహిళా రైతుకు కొంత భూమి ఉంది. ఆమె భర్త బతికుండగా ఆ గ్రామానికి చెందిన తాటపర్తి భాస్కర్‌రావుకు విక్రయించారు. కొద్దిరోజులకు అమ్మిన భూమిలో 16 కుంటలు 155 సర్వే నెంబర్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇది కొంత సమస్యను తెచ్చిపెట్టింది. దీనిపై పెద్దలను సంప్రదించి పరిష్కారానికి ప్రయత్నించారు. అయినా కొన్ని కారణాలరీత్యా ఆరేళ్లుగా సమస్య పెండింగ్‌ పడుతూ వచ్చింది. ఇటీవల ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో ఇరువర్గాలూ పరస్పర ఒప్పందానికి వచ్చాయి. 214 సర్వే నెంబరులో తాటపర్తి భాస్కర్‌రావుకు సరిపడా 16 కుంటలను కూడా ఆమె రిజిస్ట్రేషన్‌ చేసింది. సర్వే నెంబర్‌ 155లోని మిగులు భూమిని తిరిగి ఆమె పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆరేళ్ల సమస్య పది నిమిషాల్లోనే పరిష్కారమైంది.  

తొందరగా అయితదనుకోలే  

‘గతంలో రిజిస్ట్రేషన్‌ అంటే చాలా తిప్పలు పడేవాళ్లం. మా ఊరి నుంచి సాక్షులను తీసుకెళ్లి రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చేది. అయినా పని అయితదనే నమ్మకమూ ఉండేడిది కాదు. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్‌ తీసుకువచ్చి తెలంగాణ సర్కారు మంచి పనిచేసింది.  మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాక తహసీల్దార్‌ పావుగంటలోనే పని పూర్తి చేసిండు. మ్యుటేషన్‌, పట్టాబుక్కు చేతిలో పెట్టిండు. 

-చెరుకూరి వెంకటేశ్వర్లు, రైతు

కొత్తగూడెంలోనూ కొనసాగుతున్న సేవలు..

కొత్తగూడెం జిల్లాలోని మైదాన మండలాల్లోని వ్యవసాయ భూములకూ, ఏజెన్సీలోని ప్లేన్‌ రెవెన్యూ గ్రామాల్లోని వ్యవసాయ భుములకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. కొత్తగూడెంలో ఇద్దరికి మ్యుటేషన్‌ జరిగింది. కొత్తగూడెం, సుజాతనగర్‌, అశ్వారావుపేట, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో స్లాట్లు బుక్‌ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు కూడా పది నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. 

ఇంత త్వరగానా? అని ఆశ్చర్యపోయా..

  • ఇదీ.. వేపకుంట్ల రైతు 
  • ఉప్పెర్ల కొండల్‌రావు అనుభవం..

రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామానికి చెందిన రైతు ఉప్పెర్ల కొండల్‌రావు అదే గ్రామానికి చెందిన యలమంచిలి వీరయ్య దగ్గర సర్వే నెంబర్‌ 184/2లో ఎకరం పది కుంటల భూమిని కొనుగోలు జేసిండు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఇటీవల వీరయ్యను వెంటబెట్టుకొని మీ సేవ కేంద్రానికి వెళ్లిండు. ధరణి పోర్టల్‌లో ఉదయం 11 గంటలకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నడు. స్లాట్‌ జేసినప్పుడు మీసేవ కేంద్రం వాళ్లు ట్రాన్జాక్షన్‌ సమ్మరీ షీట్‌, అఫిడవిట్లు, సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్‌, పేమెంట్‌ షీట్‌, ఈ-చలాన్‌ రిసీప్ట్‌లను కొండల్‌రావుకు చేతిల పెట్టిండ్రు. తహసీల్దార్‌కు ఇవ్వాలని చెప్పిండ్రు. దీంతో కొండల్‌రావు బుధవారం స్లాట్‌ సమయానికి రెండు నిమిషాల ముందే తహసీల్దార్‌ ఎదుట హాజరైండు. పత్రాలను పరిశీలించిన తహసీల్దార్‌.. తన సిబ్బందితో రిజిస్ట్రేషన్‌ ప్రాసెసింగ్‌ పూర్తి చేయించిండు. అమ్మినోళ్లతో, కొనుగోలు చేసినోళ్లతో, సాక్షులతో సంతకాలు చేయించిండు. ఆ వెంటనే పత్రాలన్నీ స్కాన్‌ చేసి తహసీల్దార్‌ అప్రూవల్‌ రావడతో జాయింట్‌ రిజిస్ట్రార్‌ హోదాలో ఆయననొక క్లిక్‌తోనే రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేసిండు. భూమిని కొనుగోలు జేసిన కొండల్‌రావు చేతిలో పత్రాలు పెట్టిండు. కొండల్‌రావుకు అప్పటికే ఉన్న పాస్‌బుక్‌లో ఎంట్రీ కూడా చేసి ఇచ్చిండు. తాజాగా కొన్నభూమి కూడా వెంటనే పాస్‌బుక్‌లోకి ఎక్కడంతో కొండల్‌రావు ఆశ్చర్యపోయిండు. ఇంట్ల నుంచి ఆఫీసుకు వచ్చినంత సేపట్లనే రిజిస్ట్రేషన్‌ పూర్తయి పత్రాలు చేతిలోకి రావడంతో అవదుల్లేని ఆనందం వ్యక్తం చేసిండు. 

VIDEOS

logo