ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ఖమ్మం, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖమ్మం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని టీటీడీసీలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దూరదర్శన్, టీశాట్ ద్వారా విద్యాబోధన జరగుతోందన్నారు. జిల్లాలో అత్యధికంగా 92 శాతం విద్యా బోధన జరిగిందన్నారు. వచ్చే నెల 1 నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. కేజీబీవీల కోసం కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలకు హాజరు శాతంపై ఎలాంటి నిబంధనలు లేవని మంత్రి అన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక హాజరు తప్పనిసరి కాదన్నారు. తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకార పత్రం తీసుకోవాలన్నారు. మే నెలాఖరులోపు పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. విద్యాశాఖాధికారులు తరచూ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 278 ప్రభుత్వ, 178 ప్రవేట్ పాఠశాలల్లో 36,804 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. 2,290 తరగతి గదులను సిద్ధం చేశామన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్‌రావు, శిక్షణ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఈవో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.