ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Khammam - Jan 22, 2021 , 01:49:56

బాలికా విద్యకు భరోసా..

బాలికా విద్యకు భరోసా..

  • ఖమ్మం జిల్లాలో ఆరు నూతన భవనాలు
  • రూ.12.50 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • సకల హంగులతో విద్యాలయాలు
  • నేడు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు

ఖమ్మం, జనవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాలికా విద్యకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది.. డ్రాపౌట్‌ లేకుండా ప్రతి ఆడపిల్లా ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ)ను పటిష్టం చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నప్పటికీ స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేలా బోధన పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకువచ్చారు. విద్యాలయాలకు సొంత భవనాలు ఉండాలని వాటి నిర్మాణానికి రూ.12.50 కోట్లు కేటాయించారు. వీటితో ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, కొణిజర్ల, చింతకాని, బోనకల్‌, ముదిగొండ, కూసుమంచి కేజీబీవీల్లో నూతన భవనాలు రూపుదిద్దుకున్నాయి. వీటిని శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం..

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరానికి ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నది. బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. జిల్లాలోని 14 కేజీబీవీల్లో 2,537 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో కేజీబీవీ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థినులు వసతి గృహాలకు రాలేకపోయినప్పటికీ ఉపాధ్యాయులు వారికి ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి గృహాల్లో ఉన్నప్పడు నాణ్యమైన విద్యతో పాటు మెనూ పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించింది.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థినులకు అవసరమైన సామగ్రి అందేలా చూశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు శిక్షకులు యోగా, ధ్యాన శిక్షణ ఇచ్చారు. నెల నెలా సబ్బులు, కొబ్బరి నూనె అందజేశారు.

సర్వాంగ సుందరంగా రోటరీనగర్‌ పాఠశాల

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జనవరి 21: ఒకప్పుడు అరకొర వసతులతో ఉన్న ఖమ్మం నగరంలోని రోటరీనగర్‌ ఉన్నత పాఠశాల ఇప్పుడు సకల వసతులతో కళకళలాడుతున్నది. వర్షం వస్తే పాఠశాల చెరువును తలపించే స్థితి నుంచి ఇప్పుడు నాలుగు అదనపు తరగతి గది నిర్మాణాలతో ఇతర పాఠశాలలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 223 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో అయిదు తరగతి గదులు మాత్రమే ఉండటంతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ఇబ్బంది పడేవారు. సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులను చేర్చుకునే పరిస్థితి కూడా లేకపోయేది. ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో పాఠాలు బోధిస్తున్నారు. మంత్రి అజయ్‌కుమార్‌ చొరవతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులను సద్వినియోగం చేసుకోనేందుకు నాలుగు గదులు సమకూరాయి. అలాగే పాఠశాలలో గార్డెనింగ్‌ కూడా ఆకట్టుకుంటున్నది. జాతీయ విత్తానాభివృద్ధి సంస్థ సామాజిక బాధ్యత కింద రూ.2.50 లక్షలతో 3 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్యానల్‌ ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలను మంత్రి అజయ్‌కుమార్‌ సందర్శించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు మోతూకూరి మధు తెలిపారు.

జిల్లాలోని 14 కేజీబీవీల్లో ప్రస్తుతం ఉన్న భవనాలతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు వెచ్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తరగతి గదులు, అకడమిక్‌ బ్లాక్స్‌ను కొత్తగా నిర్మించింది. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రతి కేజీబీవీకి రూ.2.25 కోట్లతో 18 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు గాను నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న భవనాలను విద్యార్థినుల తమ సామగ్రి భద్రపరచునేందుకు వీలుగా, విశ్రాంతి తీసుకునేలా వసతులు సమకూరాయి. జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఎనిమిది భవనాలు గత సంవత్సరం ప్రారంభం కాగా మిగిలిన ఆరు కొత్త భవనాలను శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వీటిలో రఘునాథపాలెం కేజీబీవీ కొత్త భవనం కాగా కొణిజర్ల, చింతకాని, బోనకల్‌, ముదిగొండ, కూసుమంచి కేజీబీవీల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అకడమిక్‌ బ్లాక్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి కేజీబీవీలో ఆహ్లాదాన్ని పంచేలా గార్డెనింగ్‌ ఉంది. విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. విద్యాలయాల చుట్టూ గ్రిల్స్‌, చుట్టూ పటిష్టమైన ప్రహరీ సమకూరాయి.

విద్యార్థులకు సకల సౌకర్యాలు.. 

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. శుద్ధజలం కోసం ఆర్వో ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వసతులు ఏర్పాటు చేస్తున్నది. వచ్చే నెల నుంచి 9, 10 తరగతులు నిర్వహించనున్నాం.

- డీఈవో మదన్‌మోహన్‌, ఖమ్మం

VIDEOS

logo